జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వరరావు
బాపట్లటౌన్: ఉద్యోగ విరమణ చేసిన విశ్రాంత ఉద్యోగులకు పోలీస్‌శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వరరావు అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం చీరాల వన్ టౌన్ ఏఎస్‌ఐ ఎం.ముస్తఫా ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీస్‌శాఖలో 33 సంవత్సరాలపాటు విశేష సేవలు అందించి ఉద్యోగ విరమణ చేసిన ముస్తఫా దంపతులను సన్మానించారు. ఎస్పీ బి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ క్లిష్ట పరిస్థితుల్లో సైతం సమర్ధవంతంగా విధులు నిర్వహించడం అభినందనీయమన్నారు. గతంలో నక్సల్స్ ఉద్యమం ముమ్మరంగా ఉన్న సమయంలో తాను ఎదుర్కొన్న సవాళ్లు, నిర్వహించిన విధుల గురించి ముస్తఫా తన అనుభవాలను వెల్లడించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారిందని అన్నారు. నిబద్ధతతో విధులు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు అందించిన సహకారం వెలకట్టలేనిదన్నారు. కార్యక్రమంలో అడ్మిన్ ఆర్.ఐ మౌలుద్దీన్, చీరాల ట్రాఫిక్ ఆర్.ఎస్.ఐ పవన్, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


