నగరంపాలెం: గృహ ఎల్‌పీజీ సిలిండర్లను వినియోగించే వ్యాపార దుకాణాలు, హోటళ్లల్లో గుంటూరు ప్రాంతీయ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగపు అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. మంగళవారం బాపట్ల జిల్లా ఇంకొల్లు మండల పరిధిలోని గొల్లపాలెం రోడ్డులో ఉన్న బాలాజీ మెస్‌లో ఆరు సిలిండర్లు, మసీద్ సెంటర్‌లోని మస్తాన్ బాబా ముబారక్ హోటల్‌లో ఎనిమిది గృహ ఎల్‌పీజీ సిలిండర్లను గుర్తించారు. అక్రమంగా వినియోగిస్తున్న 14 సిలిండర్లను స్థానిక డిప్యూటీ తహసీల్దార్‌కు అప్పగించారు. ఆయా హోటళ్ల యాజమానులపై రెండు 6–ఎ కేసులు నమోదు చేశారు. తనిఖీల్లో విజిలెన్‌న్స్, పౌరసరఫరాల శాఖ అధికార, సిబ్బంది పాల్గొన్నారు.
కర్లపాలెం: చేపలవేటకు వెళ్లి వలకు చిక్కుకుని ఓవ్యక్తి మృతిచెందిన సంఘటన కర్లపాలెం మండల పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు... కర్లపాలెం పంచాయతీ పరిధిలోని లంక కాలువ కట్టపై నివసిస్తున్న అద్దూరి వెంకటరావు(50) యాజలి రెవెన్యూ పరిధిలోని తుంగభద్ర కాలువపై ఉన్న గుడిపూడి వంతెన వద్ద చేపల వేటకు దిగి కట్టువలకు చిక్కుకుని ఊపిరాడక మృతిచెందాడు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్య సముద్రాలు కుమారుడు శివనాగరాజు ఉన్నారు. కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
గుంటూరు ఎడ్యుకేషన్: ఏపీపీఎస్సీ–2023 బ్యాచ్‌లో ఎంపీడీఓగా ఎంపికై కొల్లూరు మండలంలో పోస్టింగ్ పొందిన అమర్తలూరి స్పందనకు జెడ్పీ చైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా మంగళవారం జెడ్పీ క్యాంపు కార్యాలయంలో నియామక పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ వి.జ్యోతి బసు, డెప్యూటీ సీఈఓ సీహెచ్ కృష్ణ, అకౌంట్స్ అధికారి శామ్యూల్ పాల్, ఏఓ జె.పూర్ణచంద్రారెడ్డి పాల్గొన్నారు.
గుంటూరు లీగల్: పెదకాకాని పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో పెదకాకాని మల్లేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన హుండీలోని కానుకలు లెక్కింపు సమయంలో కొంత సొమ్ము చోరీకి గురైంది. మల్లేశ్వరస్వామి దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామ రఘునందనరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఆరవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ గౌస్ నిందితురాలైన తాడికొండ మండలం గరికపాడు గ్రామానికి చెందిన ఎడ్ల శ్రీరావమ్మకు మూడు నెలలు సాధారణ జైలు శిక్ష విధించారు. ఈ కేసుకు సకాలంలో సాక్ష్యాధారాలను అందించిన సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వై.వినోద్‌కుమార్ కోర్ట్ కానిస్టేబుల్ కే.ప్రేమ్‌కుమార్‌కు సంబంధిత అధికారులు అభినందనలు తెలిపారు. కేసు లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి మురళీకష్ణ వాదనలు వినిపించారు.
రెంటచింతల: మండలంలోని పాలువాయిగేటు గ్రామ సమీపంలో ఉన్న టోల్‌ప్లాజా వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడకక్కడే మృతిచెందాడు. పాతపాలువాయికి చెందిన ఇండ్లచెరువు పుల్లారావు(28) జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. మాచర్ల నుంచి రెంటచింతల వైపు వెళ్తున్న వాహనం పుల్లారావును ఢీ కొట్టి ఉంటుందని ఆ ప్రాంతంలో వాహనానికి సంబంధించిన అద్దాలు ఉండటంవలన అనుమానిస్తున్నారు. పుల్లారావు భార్య కోటేశ్వరితో కొంతకాలంగా మనస్పర్థలు ఉన్న నేపథ్యంలో ఆమె కొత్తపల్లి గ్రామంలోని తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. ఘటన వివరాలు తెలుసుకున్న ఎస్‌ఐ సీహెచ్ నాగార్జున ప్రమాద స్థలానికి చేరుకుని విచారించారు. భార్య కోటేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.


