
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ ప్రజారోగ్యానికి చేటు
నెహ్రూనగర్: కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలల ప్రైవేటీకరణ పేరుతో రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలోని వైద్య కళాశాలలను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయిలో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రానికి తీసుకువచ్చిన 17 కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేట్‌పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. దీనిని అడ్డుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ చేసి, గవర్నర్‌ను కలసి ప్రజల గొంతుగా వినిపించేందుకు సిద్ధం అయినట్లు పేర్కొన్నారు.
● ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కొంత మందికే లాభం చేకూర్చాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలో తీసుకువచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌పరం చేయాలని చూస్తోందని మండిపడ్డారు.
● మాజీ ఎంపీ, ఎన్టీఆర్ పార్లమెంటరీ జిల్లా పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్ రాష్ట్ర వ్యాప్తంగా 17 వైద్య కళాశాలలను తీసుకువస్తే కూటమి ప్రభుత్వం వాటిని అమ్మే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
● పార్టీ గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన మహేష్ మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాలతో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
● పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు షేక్ నూరి ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా
అధ్యక్షుడు అంబటి రాంబాబు