
విలువలతో కూడిన సాహిత్యంతో మానవ సంబంధాలు మెరుగు
తాడేపల్లి రూరల్: విలువలతో కూడిన సాహిత్యంతో మానవ సంబంధాలు మెరుగుపడతాయని, ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుందని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, రచయిత్రి పి.లలితకుమారి అన్నారు. ఏపీ–ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో బుధవారం అమరావతి సాహిత్య ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన లలితకుమారి మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో పాశ్చాత్య పోకడలు పెరిగి నైతిక విలువలు పతనమవుతున్నాయని అన్నారు. ఇంజినీరింగ్, మెడికల్, న్యాయ కళాశాలల్లో మానవ విలువలను పెంపొందించే ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాలని సూచించారు. శ్రీశ్రీ,, వేమన, కరుణశ్రీ,, గురజాడ వంటి కవుల కలం నుంచి జాలువారిన సాహిత్యం ఇప్పటికీ ఆధునిక యువతను ప్రభావితం చేస్తోందన్నారు. తన సోదరి ఓల్గా మరణానంతరం ఆమె పేరును తన కలం పేరుగా మార్చుకుని రచనలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. యూనివర్సిటీ ఇన్‌చార్జి వైస్ చాన్స్‌లర్ ఆచార్య సతీష్ కుమార్ మాట్లాడుతూ వివిధ భాషలు, వాటి సాహిత్య విలువలను విద్యార్థుల్లో ప్రేరేపించే ప్రక్రియలో భాగంగా తొలిసారి వర్సిటీలో అమరావతి సాహిత్య ఉత్సవాన్ని ఏర్పాటు చేశామన్నారు. కవులు, విమర్శకులు, సాహిత్యాభిలాషులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి వారి ఆలోచనల నుంచి వచ్చే నూతన సృజనలకు ప్రాణం పోయాలన్న తలంపుతో ఈ కార్యక్రమాన్ని మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం ఓల్గాను సత్కరించారు. యూనివర్శిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఆర్.ప్రేమ్‌కుమార్, లిబరల్ ఆర్ట్స్ స్కూల్ డీన్ డాక్టర్ బిష్ణు పథ్, విభాగాధిపతి డాక్టర్ శయంటిన్ ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు.
సీ్త్రవాద రచయిత్రి పి.లలితకుమారి