
సీ్త్ర శక్తి పథకానికి బస్సులు పెంచాలి
మంగళగిరి టౌన్: సీ్త్ర శక్తి పథకం విజయవంతం కావాలంటే ప్రభుత్వం తక్షణమే బస్సులు పెంచి సిబ్బందిని నియమించాలని ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు అన్నారు. మంగళగిరి నగర పరిధిలోని సీపీఐ కార్యాలయంలో గుంటూరు జిల్లా ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యవర్గ సమావేశం బుధవారం నిర్వహించారు. తొలుత మంగళగిరి ఆర్టీసీ బస్టాండ్ నుంచి పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా దామోదరరావు మాట్లాడుతూ ప్రభుత్వం నేటికీ సీ్త్రశక్తి పథకానికి సంబంధించిన రాయితీ బకాయిలు రూ. 500 కోట్లు ఆర్టీసీకి విడుదల చేయకపోవడంతో సంస్థ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని అన్నారు. డీజిల్ కొనుగోలుకే నిధులు లేని పరిస్థితి ఉందన్నారు. సీ్త్రశక్తి పధకం సాఫల్యవంతంగా కొనసాగాలంటే ప్రభుత్వం తక్షణమే ఆర్టీసీకి రాయితీ నిధులు విడుదల చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 3 వేల బస్సులను కొనుగోలుచేసి వాటికి 10 వేల మంది సిబ్బందిని అన్నికేటగిరీల్లో నియమించాలని డిమాండ్ చేశారు. ఈ పథకం అమల్లో కొన్ని డిపోల్లో అధికారులు కండక్టర్లను అనవసరంగా సస్పెండ్ చేయడం, ఉద్యోగాల నుంచి తొలగించడం వంటి చర్యలు ఆందోళనకరమని ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితి మారకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. సమావేశంలో గుంటూరు జిల్లా ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కరిముల్లా, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శంకరరావు, జిల్లా కార్యదర్శి విజయకుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు, మంగళగిరి డిపో కమిటీ అధ్యక్షులు సాంబశివరావు, జిల్లాలోని జోన్, డిపోస్ధాయి అధ్యక్షులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు