
విద్యార్థులు సృజనాత్మకతను పెంపొందించుకోవాలి
డీఈవో చంద్రకళ ఘనంగా జిల్లా సైన్స్ సెమినార్
నరసరావుపేట రూరల్: విద్యార్థులు సృజనాత్మకతను పెంపొందించుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ తెలిపారు. జిల్లా స్థాయి సైన్స్ సెమినార్ పోటీలు శంకరభారతీపురం జెడ్పీ హైస్కూల్‌లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పోటీలను జిల్లా విద్యాశాఖ అధికారి ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 30 నమూనాలను విద్యార్థులు పోటీలో ప్రదర్శనకు ఉంచారు. కాకాని జెడ్పీ హైస్కూల్‌కు చెందిన వక్కలగడ్డ కాత్యాయనీ ప్రథమ స్థానం, నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్‌కు చెందిన కోడిరెక్క ఇమ్మానియేల్‌కు ద్వితీయ స్థానం లభించింది. ఈ రెండు నమూనాలను శనివారం విజయవాడలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికచేశారు. రాష్ట్ర స్థాయి సైన్స్ సెమినార్‌లో జిల్లా విద్యార్థులు మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని డీఈవో తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈవో ఎస్‌కె సుభాని, సత్తెనపల్లి డీఈవో ఏసుబాబు, పాఠశాల ప్రదానోపాధ్యాయురాలు ఎం.పార్వతి, జిల్లా సెన్స్ అధికారి ఎస్.రాజశేఖర్, ఉపాధ్యాయులు రఘురాం, చింత శ్రీనివాసరెడ్డి, మధుకుమార్ తదితరులు పాల్గొన్నారు.