ఇంటింటికీ తాగునీరు సరఫరానే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ఇంటింటికీ తాగునీరు సరఫరానే లక్ష్యం

Oct 18 2025 6:47 AM | Updated on Oct 18 2025 6:47 AM

ఇంటింటికీ తాగునీరు సరఫరానే లక్ష్యం

ఇంటింటికీ తాగునీరు సరఫరానే లక్ష్యం

ఇంటింటికీ తాగునీరు సరఫరానే లక్ష్యం

బాపట్ల: జలజీవన్‌ మిషన్‌ కింద ఇంటింటికీ కుళాయిల ద్వారా తాగునీరు సరఫరా చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ వి వినోద్‌ కుమార్‌ ఆదేశించారు. గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణపై జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని 265 గ్రామాల్లో 3.64 లక్షల కుటుంబాలు నివసిస్తున్నారని తెలిపారు. ఇందులో ప్రస్తుతం 1.48 లక్షల ఇళ్లకు మాత్రమే కుళాయి కనెక్షన్లు ఉన్నాయని, ఇంకా 2,15,808 ఇళ్లకు ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. డిసెంబర్‌ 31వ తేదీ నాటికి 4,493 కనెక్షన్లు ఇవ్వాలని చెప్పారు. 369 చిన్న చెరువులు, మధ్యస్త చెరువులు 25తో పాటు 5,083 చేతి పంపులు ఉన్నాయని వివరించారు. తాగునీటి ప్రాజెక్టులు సమర్థంగా నిర్వహణ, పర్యవేక్షణకు జిల్లా, గ్రామీణ స్థాయిలో కమిటీలు పని చేస్తున్నాయని తెలిపారు. 2028 నాటికి తలసరి 55 లీటర్ల నీటిని సరఫరా చేయాలనే లక్ష్యంతో జలజీవన్‌ మిషన్‌ కింద పనులు జరుగుతున్నాయని వివరించారు. జలజీవన్‌ మిషన్‌ 64 పనులను ప్రారంభించని ఏజెన్సీలకు నోటీసులు జారీ చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. రెండు వారాల్లో ప్రారంభించాలని చెప్పారు. రూ.167.48 కోట్లతో మంజూరు చేసిన 403 పనులను గడువులోగా పూర్తి చేయాలని, పురోగతిలో ఉన్న 277 పనులను ఆరు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. జల వనరుల సంరక్షణలో భాగంగా పంట కుంటలు, నీటి కుంటలు, ఇంకుడు గుంతలను విరివిగా తవ్వాలని సూచించారు.

మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలి

చెరువులు, పైపులైన్ల మరమ్మతుల కోసం రూ.9.94కోట్లు మంజూరు చేయాలని జిల్లా పరిషత్‌ డిప్యూటీ సీఈఓలను కలెక్టర్‌ కోరారు. దీనివల్ల గ్రామీణ ప్రాంత ప్రజలకు నీటి సరఫరా సజావుగా సాగుతుందని వివరించారు. ప్రస్తుతం 40 శాతమే కుళాయి కనెక్షన్ల ద్వారా తాగునీరు సరఫరా అవుతున్న నేపథ్యంలో తప్పనిసరిగా జలజీవన్‌ మిషన్‌ పనులు చేపట్టాలని ఆయన ఆదేశించారు. తాగునీటి పథకాల మరమ్మతులకు గ్రామ పంచాయతీ నిధులు లేకపోతే మండల పరిషత్‌ నిధులను తప్పనిసరిగా కేటాయించాలని ఆయన సూచించారు.

మరుగుదొడ్ల నిర్మాణ లక్ష్యాలను

పూర్తి చేయాలి

సామాజిక మరుగుదొడ్లు జిల్లాలో 406 మంజూరు కాగా, 223 మాత్రమే పూర్తయ్యాయని, మిగిలిన వాటిని పూర్తిచేయాలని కలెక్టర్‌ చెప్పారు. జిల్లాలో 18,288 ఇళ్లకు మరుగుదొడ్లు లేకపోవడంపై ఆరా తీశారు. యుద్ధప్రాతిపదికన మంజూరు చేయాలని చెప్పారు. 342 సామాజిక మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.10.26 కోట్లు మంజూరయ్యాయని, పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. 79 అంగన్‌వాడీ కేంద్రాల్లో సామాజిక మరుగుదొడ్లు నిర్మాణానికి రూ.28.4 లక్షలు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. వాడిన నీటిని శుద్ధి చేసే ప్లాంట్‌ ఏర్పాటుకు అద్దంకి నియోజకవర్గంలోని మార్టూరు గ్రామాన్ని ఎంపిక చేశామని కలెక్టర్‌ చెప్పారు. సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ అనంతరాజు, అనుబంధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఇసుక కొరత లేకుండా చర్యలు

ప్రజల అవసరాలకు ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌ కుమార్‌ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లోని మినీ వీక్షణ సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో అందుబాటులో గల ఇసుక రీచ్‌ వివరాలపై కలెక్టర్‌ ఆరా తీశారు. వర్షాకాలం పూర్తవుతున్నందున జిల్లాలో కొత్త రీచ్‌లను అన్వేషించాలని తెలిపారు. ఓలేరు రీచ్‌పై కోర్టు కేసును త్వరగా పూర్తి చేసుకుని అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. అనుమతులు వచ్చిన వెంటనే జువ్వలపాలెం రీచ్‌ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. చెక్‌ పోస్టులను ఏర్పాటు చేయాలని ఆయన అధికారులు సూచించారు. ఇసుక సరఫరా చేసే వాహనాల రిజిస్ట్రేషన్‌, జీపీఎస్‌ తప్పనిసరిగా ఉండాలని ఆర్టీవోకు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్‌ గౌడ్‌, గనుల శాఖ సహాయ సంచాలకులు రామచంద్ర, జిల్లా రవాణా అధికారి పరంధామరెడ్డి, చీరాల ఆర్డీవో చంద్రశేఖర్‌, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement