చలో.. సూర్యలంక ! | - | Sakshi
Sakshi News home page

చలో.. సూర్యలంక !

Oct 18 2025 6:47 AM | Updated on Oct 18 2025 6:47 AM

చలో..

చలో.. సూర్యలంక !

చలో.. సూర్యలంక !

22నుంచి కార్తిక మాసం ప్రారంభం ఆహ్లాదకరం సూర్యలంక తీరం వన భోజనాలకు జీడిమామిడి తోటలు అనువు హరితా రిసార్ట్స్‌లో బస సౌకర్యం

కార్తిక మాసం అనగానే మనుష్యుల మధ్య ఐకమత్యం, ప్రకృతితో మనిషికి గల అవినాభావ సంబంధాన్ని తెలిపే వన భోజనాలు గుర్తు కొస్తాయి. పచ్చ పచ్చని వనాల్లో సేద తీరడంతో భవిష్యత్‌పై ఆశలు పుడతాయి. సమష్టి తత్వం బోధ పడుతుంది. దైనందిన జీవితంలో ఆశ, నిరాశలు, ఒత్తిడి, బాధ్యతల బరువుతో సతమతమయ్యే మనిషికి కార్తిక మాసంలో చేసే వన భోజనాలు ఆటవిడుపుగా ఉంటాయి.

బాపట్ల: కార్తిక మాసం వచ్చిందంటే చాలు అందరి కళ్లూ జిల్లాలోని సూర్యలంక తీరం పైనే ఉంటాయి. ఈ నెల 22 నుంచి కార్తీక మాసం ప్రారంభం కానుంది. రాష్ట్రంలోనే సహజసిద్ధమైన తీరంగా పేరున్న సూర్యలంకకు కార్తిక మాసంలో పర్యాటకులు, భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. సముద్ర స్నానాలు చేసి, తీరానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఫారెస్ట్‌ భూమిలో ఉన్న జీడిమామిడి తోటలో వన భోజనాలు చేస్తారు. వననర్సరీ చాలా అనువుగా ఉంటుంది. స్నానాలనంతరం పూజలు చేసుకునేందుకు వీలుగా తీరం వెంబడే ఆంజనేయస్వామి దేవాలయం ఉంది.

చేరుకునేది ఇలా...

బాపట్ల నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యలంక సముద్ర తీరానికి వెళ్లేవారు ముందుగా పట్టణంలోని ఆంజనేయస్వామి దేవాలయం వద్దకు చేరుకోవాలి. అక్కడి నుంచి ఆటో సర్వీసులు అందుబాటులో ఉంటాయి. బాపట్ల నుంచి నేరుగా సూర్యలంక వరకు వెళ్తుంటాయి. ఒక్కో మనిషికి రూ.20 చార్జీ ఉంటుంది. సర్వీసులు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. కార్తిక మాసంలో వచ్చే ప్రతి ఆది, సోమవారాల రోజున బాపట్ల నుంచి ఆర్టీసీ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. రైలు మార్గాన వచ్చే వాళ్లకు స్థానిక రైల్వేస్టేషన్‌ నుంచి నేరుగా సూర్యలంకకు, బస్సు మార్గాన వచ్చే వాళ్లకు బాపట్ల పాత బస్టాండ్‌ నుంచి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. ఇతర జిల్లాల నుంచి వచ్చే పర్యాటకుల సౌకర్యార్థం గుంటూరు బస్‌ స్టేషన్‌ నుంచి కూడా నేరుగా బస్సులు అందుబాటులో ఉంటాయి.

రిసార్ట్స్‌లో వసతి సౌకర్యం

సహజ సిద్ధమైన సూర్యలంక తీరంలో ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు, పర్యాటకులు సేదతీరేందుకు వీలుగా తీరం ఒడ్డున హరితా రిసార్ట్స్‌ ఉన్నాయి. ఇందులో 25 ఏసీ రూమ్‌లు, రెండు నాన్‌ ఏసీ రూమ్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఆన్‌లైన్‌లో aptdc. gov. in అనే వెబ్‌సైట్‌ ద్వారా బుక్‌ చేసుకోవచ్చు. పర్యాటకుల సౌకర్యార్థం తీరం వెంబడి రెస్టారెంట్‌, గ్రూపు యాత్రికుల కోసం క్యాటరింగ్‌ సౌకర్యం, టూరిస్టు బోటు , తీరం వెంబడే జిమ్‌ సెంటర్‌ను కూడా నిర్వహిస్తున్నారు.

చలో.. సూర్యలంక ! 1
1/1

చలో.. సూర్యలంక !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement