
ఘనంగా ఏపీ ఎస్‌పీఎఫ్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభం
ఏఎన్‌యూ (పెదకాకాని): క్రీడల ద్వారా దేహదారుఢ్యం, ఐకమత్యం పెంపొందుతాయని ఏపీ ఎస్‌పీఎఫ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సీఎం త్రివిక్రమ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక రక్షణ దళం (ఏపీ ఎస్‌పీఎఫ్) రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు మంగళవారం ఏఎన్‌యూలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. త్రివిక్రమ్ ఈ పోటీలను ఇన్‌స్పెక్టర్ జనరల్ బీవీ రామిరెడ్డితో కలసి ప్రారంభించారు. 34వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పోటీలను నిర్వహిస్తున్నారు. డాక్టర్ త్రివిక్రమ్ మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటముల తేడా లేదని, క్రీడా స్ఫూర్తి గొప్పదన్నారు. ఇన్‌స్పెక్టర్ జనరల్ బీవీ రామిరెడ్డి మాట్లాడుతూ డైరెక్టర్ జనరల్‌గా త్రివిక్రమ్ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఏపీ ఎస్‌పీఎఫ్‌లో మార్పులు శరవేగంతో జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో పలు చోట్ల మినీ శిక్షణ కేంద్రాలు ఏర్పాటుకు ప్రభుత్వం స్థలాలు కేటాయించిందన్నారు. సిబ్బంది సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. ఉద్యోగుల పదోన్నతులు, నూతన నియామకాలపై దృష్టి పెట్టారని చెప్పారు. ఈ క్రీడా పోటీలలో వాలీబాల్, బాడ్మింటన్, 100 మీటర్లు, 400 మీటర్లు, 5 కిలో మీటర్ల పరుగు పందేలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ యూనిట్ల నుంచి దాదాపు రెండు వందల మంది అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విజయవాడ జోన్ కమాండెంట్ ముద్దాడ శంకర్రావు, కమాండెంట్ డీఎన్‌ఏ బాషా, అసిస్టెంట్ కమాండెంట్లు, ఇన్‌స్పెక్టర్లు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.