
రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలు ప్రారంభం
రేపల్లె: క్రీడలతో శారీరక దృఢత్వమే కాకుండా మానసికోల్లాసం, సంపూర్ణ ఆరోగ్యాలు చేకూరతాయని బాపట్ల జిల్లా కామన్ ఎగ్జామినేషన్ సెక్రటరీ కొచ్చెర్ల ప్రభాకరరావు తెలిపారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, విద్యాశాఖల సంయుక్త ఆధ్వర్యంలో 16వ రాష్ట్రస్థాయి అండర్–14 బాల బాలికల తైక్వాండో పోటీలు మండలంలోని పేటేరు జడ్పీ హైస్కూలులో శనివారం ప్రారంభమయ్యాయి. పాఠశాలలో జెండా వందనం చేసి పోటీలను ప్రభాకరరావు ప్రారంభించి మాట్లాడారు. క్రీడల్లో రాణించే వారికి మంచి గుర్తింపుతో పాటు బంగారు భవిష్యత్ లభిస్తుందని చెప్పారు. కేవలం చదువుకే పరిమితం కాకుండా విద్యార్థులు ఆటపాటల్లో రాణించాలని తెలిపారు. పోటీలకు ఉమ్మడి 13 జిల్లాల నుంచి జిల్లాకు 20 మది చొప్పున 260 మంది క్రీడాకారులు హాజరయ్యారని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు బాపూజీ, సర్పంచ్ కనపర్తి వసుమతి, ఎస్‌ఎంసీ చైర్మన్ వీర్లంకయ్య, బాపట్ల జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ కె.వెంకటేశ్వరరావు, రాష్ట్ర పరిశీలకులు దేవేంద్రనాథ్, నాయకులు గోలి రామశేషగిరిరావు, శాస్త్రి, పర్చూరు శ్యామ్‌ప్రసాద్, రావు ప్రభాకరరావు, కనపర్తి రవికిరణ్, వివిధ పాఠశాలల పీఈటీలు, ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలు ప్రారంభం