
కడలి వెంట కన్నీటి చూపులు
తీరానికి వచ్చిన గౌతమ్ మృతదేహం జాడలేని షారోన్ ఆచూకీ
చీరాల: కడలి కెరటాలు ఆ కుటుంబాల్లో కన్నీటిని మిగిల్చాయి. సరదాగా సేద తీరేందుకు వచ్చి సముద్ర స్నానం చేస్తుండగా అలల తాడికిడి గల్లంతై ఐదుగురు విద్యార్థులు మృత్యువాత పడడంతో తీరం కన్నీటి సంద్రంగా మారింది. గల్లంతైన వారిలో ముగ్గురి మృతదేహాలు ఆదివారం రాత్రి ఒడ్డుకు చేరాయి. మరో విద్యార్థి మృతదేహం సోమవారం తీరానికి చేరింది.దీంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
ఆశలు అడియాస
అమరావతి పరిధిలోని విట్ ఇంజినీరింగ్ కాలేజీలో ఎంటెక్ చదువుతున్న ఏడుగురు స్నేహితులు ఆదివారం సెలవు దినం కావడంతో సరదాగా గడిపేందుకు చీరాల రూరల్ మండలం వాడరేవు సముద్ర తీరానికి వచ్చారు. సరదాగా సముద్రతీరంలో కేరింతలు కొట్టారు. ఉవ్వెత్తున వస్తున్న అలల ధాటిని కూడా లెక్క చేయకుండా సముద్రంలో కేరింతలు కొట్టారు. కొద్దిసేపటికి అలలు ఎక్కువగా రావడంతో ఏడుగురు గల్లంతయ్యారు. స్థానిక మత్య్సకారులు గమనించి నలుగురు విద్యార్థులను బయటకు తీసుకువచ్చారు. అయితే, వీరిలో ఎంటెక్ చదువుతున్న సాయి మణిదీప్ (జడ్చర్ల), జీవన్ సాత్విక్ (హైదరాబాద్), శ్రీసాకేత్ (హైదరాబాద్)లు సముద్రంలో అలల తాకిడికి గల్లంతయ్యారు. ఎంత గాలించినా ముగ్గురి జాడ కానరాలేదు. కొంత సమయం తర్వాత ముగ్గురి మృతదేహాలు తీరానికి చేరాయి.
భోరుమన్న గౌతమ్ కుటుంబ సభ్యులు
మరో ఘటనలో వేటపాలెం మండలం వడ్డె సంఘానికి చెందిన ఇద్దరు విద్యార్థులు కూడా గల్లంతయ్యారు. ఆదివారం రాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టినా ఇద్దరి ఆచూకీ లభించలేదు. జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ స్వయంగా వాడరేవు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. మైరెన్, గజ ఈతగాళ్లు, అగ్నిమాపక సిబ్బంది సహకారంతో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి కోసం కుటుంబ సభ్యులు రాత్రంతా తీరం వద్దనే వేచి ఉన్నారు. సోమవారం ఉదయం తీరానికి గౌతమ్ కృష్ణప్రసాద్ మృతదేహం వచ్చింది. దీంతో కుమారుడిని చూసి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి
ఆదివారం వాడరేవు సముద్రతీరంలో గల్లంతై మృతి చెందిన ముగ్గురు విద్యార్థులు, సోమవారం తీరానికి చేరిన మరో విద్యార్థికి చీరాల ఏరియా వైద్యశాలలో సోమవారం పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. విద్యార్థులు గల్లంతైన సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలియచేయడంతో వారు హుటాహుటిన చీరాలకు వచ్చారు. ఏరియా వైద్యశాలలోని మార్చురీలో ఉన్న మృతదేహాలను చూసి కన్నీటిపర్యంతమయ్యారు. పెద్ద చదువులు చదువుకొని ఆసరాగా నిలుస్తారని అనుకుంటే అందరిని వదిలి వెళ్లిపోయావా? అంటూ కుటుంబ సభ్యులు చేస్తున్న ఆర్తనాదాలు కంటతడి పెట్టించాయి.
తీరంలో గాలింపు చర్యలు ముమ్మరం
ఆదివారం వాడరేవు సముద్రతీరంలో వేర్వేరు సంఘటనల్లో గల్లంతైన ఐదుగురు విద్యార్థుల్లో నలుగురు మృతదేహాలు లభ్యం కాగా మరో విద్యార్థి షారోన్ ఆచూకీ లభించలేదు. జిల్లా కలెక్టర్ వినోద్‌కుమార్ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్, ఆర్డీఓ చంద్రశేఖర్‌నాయుడు, చీరాల డీఎస్పీ, సీఐలు, ఎస్సైలు తీరం వెంట గాలింపు చర్యలు చేపట్టారు. ఉదయం నుంచి వర్షం కురుస్తున్నా గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రానికి కూడా షారోన్ మృతదేహం లభించలేదు. దీంతో షారోన్ కోసం కుటుంబ సభ్యులు కూడా తీరం వెంటే ఉన్నారు.

కడలి వెంట కన్నీటి చూపులు