
● కలెక్టర్ వినోద్‌కుమార్ ● గల్లంతైన విద్యార్థి కోసం
చీరాల: మండలంలోని వాడరేవులో ఆదివారం జరిగిన ఘటన చాలా బాధాకరమైనదని జిల్లా కలెక్టర్ వినోద్‌కుమార్ పేర్కొన్నారు. సోమవారం రాత్రి ఆయన చీరాల మండలం వాడరేవు సముద్ర తీరం వద్ద గాలింపు చర్యలను పర్యవేక్షించారు. బాధిత కుటుంబాలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారన్నారు. నలుగురి మృతదేహాలు లభించాయని, మరొకరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని తెలిపారు. జిల్లాలోని బీచ్‌ల వద్ద రానున్న రోజుల్లో ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటామని చెప్పారు. విద్యార్థి ఆచూకీ కోసం పోలీస్, మత్య్సశాఖ, రెవెన్యూ, అగ్నిమాపక శాఖ అధికారుల బృందాలు శ్రమిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి కోస్ట్‌గార్డ్, ఎన్‌డీఎఫ్‌ఆర్ కూడా తెలియచేసి వారి సహాయం కూడా తీసుకున్నామని చెప్పారు. సోమవారం ఉదయం కురిసిన వర్షం కారణంగా గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడిందని తెలిపారు. పది బోట్లు, ఆరు డ్రోన్ కెమెరాలు, పది మంది గజ ఈతగాళ్లు, పది మంది వీఆర్వోలను ఘటన జరిగిన వాడరేవు ప్రాంతం నుంచి ఇరువైపులా నాలుగు కిలోమీటర్ల పరిధిలో పరిశీలించేందుకు ఏర్పాట్లు చేశామని కలెక్టర్ వెల్లడించారు. చుట్టు పక్కల గల మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లిన సమయంలో మృతదేహం కనిపిస్తే చీరాల తహసీల్దార్, రూరల్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పామన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కలెక్టర్ వెంట జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాస నాయక్, జిల్లా అగ్నిమాపక అధికారి నవీన్, ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు, తహసీల్దార్ కె.గోపీకృష్ణ, డీఎస్పీ ఎండీ మోయిన్, రూరల్ పోలీసులు ఉన్నారు.