
అవకాశం లేకే ఆ బిర్యానీ తిన్నాం !
అప్పటి నుంచే వాంతులు, విరేచనాలు విచారణకు వచ్చిన ఉన్నతాఽధికారుల ఎదుట విద్యార్థుల ఆవేదన
ప్రత్తిపాడు: పెదనందిపాడు మండలం అన్నపర్రు బీసీ బాలుర హాస్టల్‌లో 54 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం బీసీ సంక్షేమశాఖ స్టేట్ అడిషనల్ డైరెక్టర్ డి.చంద్రశేఖర్‌రాజు, వైద్య ఆరోగ్యశాఖ అడిషనల్ డైరెక్టర్ బి.సుబ్రమణ్యేశ్వరి హాస్టల్‌లో విచారణ నిర్వహించారు. విద్యార్థులను ప్రశ్నించగా అవకాశం లేకే బిర్యానీ తిన్నామని చెప్పారు. తాజాగా ఉందా.. వాసన వస్తుందా ? అని అడుగ్గా తాజాగా లేదని తెలిపారు. హాస్టల్ వంటగది, విద్యార్థుల రూమ్‌లు, బెడ్‌లు, వంట పాత్రలు, తాగు నీరు తదితరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. హాస్టల్ వాతావరణం అపరిశుభ్రంగా, గదుల్లో బూజుపట్టి ఉండటంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇదేమని సిబ్బందిని ప్రశ్నించారు. ఇంత ఘటన జరిగిన తరువాత కూడా హాస్టల్ ఇలా ఉంటే ఎలాగని ఆగ్రహించారు.