
సంక్షేమ పథకాలకు రూ. 47వేల కోట్లు ఖర్చు
కొల్లిపర: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో రూ. 47 వేల కోట్లను సంక్షేమ పథకాలకు ఖర్చు చేశామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మండలంలోని చక్రాయపాలెంలో శఽనివారం రూ.81 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ (కల్యాణ మండపం) ప్రారంభంతో పాటు అత్తోటలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్‌తో కలసి శంకుస్థాపన చేశారు. కేంద్ర మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ ఎన్నికల్లో తనకు 95 శాతం ఓట్లు వేసి గెలిపించిన ఏకై క గ్రామం చక్రాయపాలెమని కొనియాడారు. కల్యాణ మండపం చుట్టూ కాంపౌండ్ వాల్, డొంక రోడ్డు , డ్రెయినేజీలు నిర్మాణ సమస్యలను గ్రామస్తులు తన దృష్టికి తీసుకు వచ్చినట్లు తెలిపారు. ఎంపీ నిధులు నుంచి కాంపౌండ్ వాల్ నిర్మాణానికి, విద్యుత్ ట్రాన్స్‌ఫారం కోసం రూ.13 లక్షలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. మిగిలిన సమస్యల్ని త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర మంత్రి మనోహర్ మాట్లాడుతూ రాబోవు 15 రోజుల్లో దేశంలో ఎన్నడూ లేని విధంగా విశాఖపట్టంలో గూగుల్ సంస్థ రూ.87 వేల కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం సహాయ, సహకారాలు అందిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో చందు నాగేశ్వరరావు, అమ్మిశెట్టి హరికృష్ణ, సీతారామయ్య, హరికృష్ణ, కూటమి నాయకులు పాల్గొన్నారు.
కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్