
యూపీఐ మోసాలపై అప్రమత్తత అవసరం
బాపట్ల టౌన్: యూపీఐ మోసాలపై వ్యాపారస్తులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ ఎఫైర్స్ 14సీ (ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్) నిర్వాహకులు అక్టోబర్‌ను సైబర్ నేరాల అవగాహన మాసంగా ప్రకటించారని తెలిపారు. దానిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేకంగా యూపీఐ పేమెంట్స్ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాల గురించి ప్రజలు, వ్యాపారస్తులకు అవగాహన కల్పించడానికి జిల్లా పోలీస్ అధికారులు కృషి చేస్తున్నట్లు తెలిపారు. తమ పరిధిలోని మార్కెట్లలో, వ్యాపార సముదాయాల్లో ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వివరించారు. దుకాణదారులు అపరిచిత వ్యక్తులకు యూపీఐ పిన్ నమోదు సంఖ్య చెప్పవద్దని ఎస్పీ సూచించారు. ఒక్కసారి సైబర్ నేరస్తుల వలలో పడితే పోయిన డబ్బులను తిరిగి పొందడం చాలా కష్టమని చెప్పారు. స్మార్ట్ ఫోన్‌న్లలో పేమెంట్ యాప్‌లను ఉపయోగించి సులభంగా లక్షల్లో లావాదేవీలు కూడా క్షణాల్లో చేసేస్తున్నారని పేర్కొన్నారు. తెలియని వ్యక్తులు దుకాణాలకు వచ్చి వస్తువులు కొనుగోలు చేసి ఫోన్‌న్‌పే, గూగుల్ పే చేస్తామని చెబుతారన్నారు. ముందుగా రూ.1 పంపి తర్వాత యూపీఐలో మనీ రిక్వెస్ట్ పంపి ఖాతాలో మొత్తం డబ్బుని దొంగిలిస్తున్నారని ఎస్పీ వివరించారు. ఎట్టి పరిస్థితులలోనూ ఫోన్ ఇతరులకు ఇవ్వకూడదని, సైబర్ మోసానికి గురైనట్లు గ్రహిస్తే వెంటనే హెల్ప్‌లైన్ నంబర్ 1930కు కాల్ చేయాలని సూచించారు.
ఎస్పీ బి. ఉమామహేశ్వర్