
తెగిపడిన యమపాశాలు
ఇద్దరికి గాయాలు తప్పిన పెను ప్రమాదం
మార్టూరు: ఏడాదిగా వలపర్ల గ్రామస్తులు భయపడుతున్నట్లే జరిగింది. గ్రామంలోని ఏ వీధి చూసినా శిథిలమైన విద్యుత్ స్తంభాలు, వేలాడుతున్న విద్యుత్ వైర్ల గురించి ఆ శాఖ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. వలపర్ల సినిమా హాల్ సెంటర్‌లో నిత్యం రద్దీగా ఉండే వైన్స్ షాప్ ఎదురుగా శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో వేలాడుతున్న విద్యుత్ వైర్లు తెగి ఇద్దరిపై పడ్డాయి. అయితే, వారు తప్పించుకొని ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. సెంటర్‌లో అప్పటికే వైన్ షాప్ ముందు మందుబాబుల హడావుడితో పాటు హోటళ్ల ముందు ప్రజల రాకపోకలతో మెయిన్ రోడ్ అంతా హడావుడిగా మారింది. ఈ క్రమంలో చాలా కాలంగా వేలాడుతూ ఉన్న రెండు విద్యుత్ వైర్లు ఒక్కసారిగా తెగి కింద పడ్డాయి. గమనించిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. గ్రామానికి చెందిన పూరిమెట్ల వెంకటేశ్వర్లు, గోలి కృష్ణ ప్రసాద్‌కు అవి తగలడంతో గాయపడ్డారు. విద్యుత్ వైర్లు తెగి పడిన క్రమంలో ఫ్యూజులు పోవటంతో ప్రసారం నిలిచిపోయింది. లైన్‌మేన్ కుమార్, సిబ్బంది తెగిపడిన విద్యుత్ వైర్లను తాత్కాలికంగా సరి చేశారు. గాయపడిన కృష్ణ ప్రసాద్‌ను స్థానిక ప్రైవేటు వైద్యుని వద్ద ప్రథమ చికిత్స చేయించి, అనంతరం మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రెండో బాధితుడు వెంకటేశ్వర్లను బంధువులు మొదట ఇంటికి తరలించగా, గుండెల వద్ద నొప్పిగా ఉందని చెప్పడంతో సాయంత్రం స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. సమస్యపై పలుమార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు పట్టించుకోలేదని గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తెగిపడిన యమపాశాలు

తెగిపడిన యమపాశాలు