
ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలి
పల్నాడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రవి
రెంటచింతల: స్థానిక పీహెచ్‌సీ కేంద్రానికి వివిధ రకాల వ్యాధులతో వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కె.రవి సిబ్బందికి సూచించారు. స్థానిక పీహెచ్‌సీ కేంద్రాన్ని ఆయన శుక్రవారం జిల్లా మలేరియా అధికారి రత్నాకర్‌తో కలసి ఆకస్మికంగా సందర్శించారు. ల్యాబ్‌లో నిర్వహిస్తున్న పరీక్షల గురించి తెలుసుకుని రికార్డులు పరిశీలించారు. ప్రస్తుతం జ్వరాల సీజన్ కాబట్టి ల్యాబ్ టెక్నీషియన్లు నిత్యం ఆస్పత్రిలో అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన సేవలు అందించాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఆరోగ్య సిబ్బందికి సలహాలు, సూచనలు అందిస్తూ ఉండాలని చెప్పారు. ప్రస్తుతం పీహెచ్‌సీ పరిధిలో జ్వరం కేసుల వివరాలను మెడికల్ ఆఫీసర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రతి రోజూ పీహెచ్‌సీకి వచ్చే రోగుల వివరాలు(ఓపీ) నమోదు, ఆస్పత్రిలో రోగులకు ఆరోగ్య, ఆశా కార్యకర్తలు అందిస్తున్న సేవలు, రక్త పరీక్షల వివరాలు, మందులు ఇచ్చే విభాగం పనితీరు, వివిధ రికార్డులు పరిశీలించారు. అనంతరం రెంటచింతల గ్రామంలోని పలు ప్రాంతాలలో పర్యటించారు. ఫ్రైడే డ్రైడేను పరిశీలించారు. స్థానిక ఆరోగ్య సిబ్బందికి విష జ్వరాలపై పలు సూచనలు చేశారు. పారిశుద్ధ్య కార్యక్రమాలను మెరుగుపరచాలని ఆదేశించారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్‌వైజర్ ఎన్.కోటేశ్వరరావు, మలేరియా సూపర్‌వైజర్ సీహెచ్ అంకమ్మరావు, ఎంపీహెచ్‌ఈఓ ఏడీ శర్మ, ఎ.ఆంజనేయులు, హెల్త్ అసిస్టెంట్ షేక్ ఖాసింసా, ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.