
విద్యార్థులు వ్యవస్థాపకులుగా ఎదగాలి
పెదకాకాని: విద్యార్థులు వ్యవస్థాపకులుగా ఎదిగి పరిశ్రమలను స్థాపించాలని, వినూత్న ఆలోచనలతో నూతన ఆవిష్కరణలు చేపట్టి విజయవంతం కావాలని పల్నాడు జిల్లా పరిశ్రమల అధికారి ఎం.నవీన్ కుమార్ సూచించారు. వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్సిటీలోని మెకానికల్ ఇంజినీరింగ్, ఐఈఐ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రెండురోజుల జాతీయ స్థాయి సాంకేతిక సదస్సు ‘ఆమేయా –2కే25’ ముగింపు వేడుకలకు శుక్రవారం ముఖ్య అతిథిగా నవీన్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాస్తవ ప్రపంచ నైపుణ్యాలను నేర్చుకోవడానికి, పరిశ్రమలకు తగ్గట్టు సన్నద్ధం అవటానికి విద్యార్థి దశ కీలకమని తెలిపారు. మొబైల్ యాప్‌లను వినియోగించడమే కాకుండా సమాజానికి ఉపయోగపడేలా వాటి తయారీపై దృష్టి సారించాలని సూచించారు. సదస్సులో జిగ్ టెక్, పేపర్ అండ్ పోస్టర్ ప్రజెంటేషన్, ఆర్‌సీ కార్నేజ్, పిక్టో, క్రిక్ క్విజ్ వంటి సాంకేతిక పోటీలలో విజేతలకు ఆయన బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ వై. మల్లికార్జునరెడ్డి, డైరెక్టర్ డాక్టర్ రావెల నవీన్, మెకానికల్ విభాగాధిపతి డాక్టర్ టి.శ్రీనివాసరావు, సంధానకర్త వి.కిరణ్ కుమార్, ఐఈఎం విద్యార్థి విభాగ సభ్యులు ఎస్.పవన్ సాయి, సీహెచ్ విష్ణు, విద్యార్థులు పాల్గొన్నారు.