
ధాన్యం కొనుగోలులో అప్రమత్తంగా ఉండాలి
జాయింట్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాస్తవ
గుంటూరు వెస్ట్: ఖరీఫ్ సీజన్ 2025–26లో ధాన్యం సేకరణపై ఆయా శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో ఏపీ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యాన ఖరీఫ్ సీజన్ 2025–26లో ధాన్యం సేకరణపై అవగాహన, శిక్షణ సదస్సు నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో రైతు సేవ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. జిల్లాలో 50 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలిపారు. ధాన్యం కనీస మద్దతు ధర సాధారణ రకం (కామన్) క్వింటా (100కిలోలు) రూ.2369, ‘ఏ’ గ్రేడ్ రకం క్వింటా (100కిలోలు) రూ.2,389లుగా నిర్ణయించినట్లు తెలిపారు. గత సంవత్సరం మద్దతు ధర కన్నా రూ.69 అధికంగా చెల్లించనున్నట్లు తెలిపారు. ధాన్యం విక్రయంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా టోల్ ఫ్రీ నంబర్ 1967కు ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఏడు గంటలలోపు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. గుంటూరు జిల్లా కంట్రోలు రూం ఏర్పాటు చేసినట్లు(నం.9491392717) తెలిపారు. సమావేశంలో సివిల్ సప్లయీస్ డీఎం తులసి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బండ్లమూడి వెంకయ్య చౌదరి, మిల్లర్లు పాల్గొన్నారు.