
జిల్లాలో యూరియా కొరత లేదు: కలెక్టర్
బాపట్ల టౌన్: జిల్లాలో యూరియా కొరత లేదని కలెక్టర్ డాక్టర్ వి. వినోద్‌కుమార్ తెలిపారు. జిల్లాలో సోమవారం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఆర్‌ఎస్‌కేలు, పీఏసీఎస్ 35 కేంద్రాల ద్వారా 4,983 మంది రైతులకు 220 మెట్రిక్ టన్నుల యూరియాను పంపిణీ చేసినట్లు చెప్పారు. ఇంకా 220 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందని పేర్కొ న్నారు. అవసరమైన రైతులు ఆయా గ్రామాల పరిధిలోని రైతుసేవా కేంద్రాలు, సహకార పరపతి సంఘాల ద్వారా పొందవచ్చని ఆయన సూచించారు.
గుంటూరులో హత్య.. గుండ్లకమ్మలో శవం!
మద్దిపాడు/లక్ష్మీపురం: గుంటూరులో హత్యకు గురైన వ్యక్తి ప్రకాశం జిల్లా మద్దిపాడు సమీపంలోని గుండ్లకమ్మ నదిలో శవమై తేలాడు. అందిన సమాచారం ప్రకారం.. వేముల రామాంజనేయులు(45) కనిపించకపోవడంతో భార్య గుంటూరులోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు గుంటూరు పోలీసులు బండారు కొండయ్యను అదుపులోకి తీసుకుని విచారించారు. రామాంజనేయులును హత్య చేసి మద్దిపాడు మండలం వెల్లంపల్లి సమీపంలోని గుండ్లకమ్మ నది పక్కన పూడ్చి వేసినట్లు అంగీకరించాడు. గుంటూరు పోలీసులు సోమవారం రాత్రి 7:30 గంటల సమయంలో మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు తరలించారు. గుంటూరు పోలీసులకు మద్దిపాడు ఎస్‌ఐ సైదులు సహకారం అందించారు.
యూరియా కోసం ఆందోళన వద్దు
ఆర్డీఓ చంద్రశేఖరనాయుడు
కారంచేడు: యూరియా కోసం అన్నదాతలు ఆందోళన చెందాల్సిన పనిలేదని, అందరికీ సరఫరా చేస్తామని చీరాల ఆర్డీఓ చంద్రశేఖరనాయుడు స్పష్టం చేశారు. సోమవారం ఆయన కారంచేడు సొసైటీ వద్ద యూరియా పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. ‘యూరియా కోసం తిప్పలు’ అనే శీర్షికతో సాక్షి స్టేట్ పేజీలో వచ్చిన కథనానికి రెవెన్యూ, పోలీస్, వ్యవసాయాధికారులు స్పందించారు. సంబంధిత అధికార యంత్రాంగం మొత్తం కారంచేడులో తిష్టవేసి ఎరువులు సరఫరా చేయించారు. గ్రామంలో రైతులకు అవసరమైన ఎరువులను దగ్గరుండి అన్ని సౌకర్యాలతో పంపిణీ చేయించారు. ఆదివారం ఎండలో రైతులు పడిగాపులు పడటంతో అధికారులు టెంట్ వేయించి, రైతులు కూర్చోవడానికి కుర్చీలు కూడా వేయించారు. వరుస క్రమంలో పేర్లు పిలచి యూరియాను సరఫరా చేశారు.
పీజీ రెండవ సెమిస్టర్ ఫలితాలు విడుదల
పెదకాకాని(ఏఎన్‌యూ): ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో జూలైలో జరిగిన పీజీ కోర్సుల రెండవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను సీఈ ఆలపాటి శివప్రసాదరావు సోమవారం విడుదల చేశారు. ఎంఎస్సీ స్టాటిస్టిక్స్‌లో 45 మందికి 44 మంది, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీలో 24 మందికి 17మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. రీవాల్యూయేషన్‌కు ఈనెల 24వ తేదీలోగా ఒక్కో పేపరుకు రూ.1860, పర్సనల్ వెరిఫికేషన్‌కు రూ.2190 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
మానవత్వం చూపిన పోలీసులు
మంగళగిరి టౌన్: మంగళగిరి నగర పరిధిలోని హుస్సేన్ కట్ట వద్ద గత నాలుగు రోజులుగా మతిస్థిమితం లేని ఓ మహిళ తిరుగుతోంది. ఇది గమనించిన స్థానికులు పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ రవీంద్రనాయక్ తక్షణమే స్పందించి సోమవారం ఉదయం ఆ మహిళను మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విజయవాడ గిరిపురం అని తప్ప ఆమె ఇంకేమీ వివరాలు వెల్లడించలేక పోతోందని, ఆమె చెప్పిన ప్రాంతానికి పోలీస్ సిబ్బందిని పంపించినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

జిల్లాలో యూరియా కొరత లేదు: కలెక్టర్

జిల్లాలో యూరియా కొరత లేదు: కలెక్టర్