
కృష్ణమ్మ పరవళ్లు
కొల్లూరు : కృష్ణా నదిలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజ్‌కు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటిని దిగువుకు యథాతథంగా దిగువకు విడుదల చేస్తుండటంతో నది నిండు కుండలా మారింది. బ్యారేజ్ నుంచి సోమవారం ఉదయం 3.15 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి వదలడంతో మధ్యాహ్నం నుంచి వరద ప్రవాహ తీవ్రత పెరిగింది. అంచులను ఒరుసుకుకంటూ కృష్ణమ్మ ప్రవహిస్తోంది. పెసర్లంక అరవింద వారధి సమీపంలోని నక్కపాయ గండి, గాజుల్లంక చినరేవు ద్వారా వరద నీరు లోతట్టు ప్రాంతాలతో పాటు ఇటుక బట్టీలు, పల్లపు ప్రాంతాల్లోకి భారీగా చేరింది. దోనేపూడి కరకట్ట దిగువున పోతార్లంక, తిప్పలకట్ట, కిష్కింధపాలెం, తోకలవారిపాలెం, జువ్వలపాలెం, తడికలపూడి గ్రామాలకు వెళ్లే లోలెవల్ వంతెన పైనుంచి వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
ఉద్ధృత ప్రవాహం.. ప్రాణాలు పణం
ఉద్ధృతమైన కృష్ణా నదీ వరద ప్రవాహంలో ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలు రాకపోకలు కొనసాగిస్తున్నా నిలువరించే నాథులే కరువయ్యారు. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం దోనేపూడి – పోతార్లంక మార్గంలో ఉన్న లోలెవల్ వంతెన పైనుంచి సోమవారం ఉదయం నుంచి వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ప్రజలు, వాహనాలు రాకపోకలు నియంత్రించాల్సిన పోలీసు, రెవెన్యూ సిబ్బంది పత్తా లేరు. ప్రజలు ప్రమాదకర పరిస్థితిలో వరద నీటిలో రాకపోకలు సాగిస్తున్నారు. ప్రవాహంలో ఏ మాత్రం పట్టు కోల్పోయినా ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. పోలీసు, రెవెన్యూ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. సోమవారం సాయంత్రానికి ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి వదులుతున్న నీటి పరిమాణం క్రమంగా తగ్గుతూ 2.34 లక్షలకు చేరింది. మంగళవారానికి నీటి మట్టం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని ఆర్‌సీ అధికారులు అభిప్రాయపడుతున్నారు.