తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేస్తామంటూ హెచ్చరిక
మార్టూరు: మార్టూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం రెవెన్యూ సమస్యలపై ధర్నా నిర్వహించారు. అధికార పార్టీ నాయకులు సైతం పాల్గొనటం సమస్యల తీవ్రతకు అద్దం పట్టింది. తహసీల్దార్ టి. ప్రశాంతిని నాయకులు రైతుల సమస్యలపై నిలదీయడంతో ఆమె ఇబ్బందికి గురయ్యారు. ధర్నాలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కందిమళ్ల రామకోటేశ్వరరావు, ఇతర నాయకులు రెవెన్యూ సమస్యలపై స్పందించారు.
తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి
బాపట్ల జిల్లాలో ఎక్కడా లేనివిధంగా మార్టూరు తహసీల్దార్ కార్యాలయం లో అవినీతి విపరీతంగా పెరిగి పోయింది. ప్రతి గ్రామంలోనూ జాయింట్ ఎల్పీఎం నంబర్లతో రైతులకు 1బీలు రాక బ్యాంకు రుణాలు పొందలేక, రిజిస్ట్రేషన్లు జరగక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్టూరు మండలంలోని ద్వారకపాడు, వలపర్ల, లక్కవరం గ్రామాలతో పాటు అద్దంకి నియోజకవర్గంలోని వల్లాపల్లి, ధర్మవరం, కొమ్మినేని వారి పాలెం రామకూరు గ్రామాల్లోని 2565 ఎకరాలు భూమి ఎలాంటి రిజిస్ట్రేషన్, మ్యుటేషన్లు జరగలేదు. వందలాది మంది రైతులు గత 12 సంవత్సరాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండేసి గ్రామాలకు ఒక వీఆర్వోను నియమించడంతో వారు తప్పించుకు తిరుగుతున్నారని, వసూళ్లు ఎక్కువయ్యాయని రైతు సంఘ నేతలు ఆరోపించారు. ఇటీవల అవినీతి వీఆర్వోలపై ఫిర్యాదు చేస్తే వారిని బదిలీ చేశారు కానీ సమస్యలు మాత్రం యథావిధిగానే ఉన్నాయని తెలిపారు. ఈ మధ్యకాలంలో నిర్వహించిన గ్రామ రెవెన్యూ సదస్సులలో ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదని చెప్పారు. రైతులు ఇచ్చిన వందలాది అర్జీలను కనిపించకుండా మాయం చేశారని ఆరోపించారు. మండలంలోని రెవెన్యూ సమస్యలపై గత నాలుగు నెలల కాలంలో తహసీల్దార్ కు రెండుసార్లు, ఎమ్మెల్యే ఏలూరి దృష్టికి రెండుసార్లు తీసుకెళ్లినా సమస్యలు పరిష్కారం కాలేదని తెలిపారు. ఇటీవల ఇంకొల్లులో రెవెన్యూ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రులను కలిసి సమస్యల గురించి అర్జీలు ఇచ్చినప్పటికీ ఫలితం లేదని వాపోయారు.
విసిగి వేసారిపోతున్న రైతులు
భూ సమస్యలు పరిష్కారం కాక రైతులు విసిగి వేసారి పోతున్నారని, సమస్యలు త్వరలో పరిష్కారం కాకుంటే తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేస్తామని రామకోటేశ్వరరావు హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ టి. ప్రశాంతికి నాయకులు వినతిపత్రం అందజేసి, సమస్యల గురించి ఏకరువు పెట్టారు. దీనిపై స్పందించిన తహసీల్దార్ మాట్లాడుతూ వీఆర్వోలు దాదాపుగా ఉన్నారని, కోనంకి, కొలలపూడి గ్రామాలకు మాత్రం రావాలంటే భయపడుతున్నారని, అందుకు తానేమి చేయలేనని తెలిపారు. అధికార పార్టీకి చెందిన కొందరు రైతు నాయకులు మాట్లాడుతూ గ్రామాల్లో కొంతమంది నాయకులు చెప్పిన పనులే అధికారులు చేస్తున్నారని, మిగిలిన వారి పనులను సదర నాయకులే అడ్డుకుంటున్నారని చెప్పటం గమనార్హం. కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షుడు వీరవల్లి కృష్ణమూర్తి ఎనికపాటి రాంబాబు, గోనుగుంట్ల మోహనరావు, తాళ్లూరి శివరావు, బెజవాడ కృష్ణయ్య, బి సూరిబాబు, కందిమళ్ల శ్రీనివాసరావు, రైతులు, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.