
గుటకాయ‘స్వాహా’పై విచారణ
కర్లపాలెం: విద్యార్థుల సొమ్ము స్వాహా అని ఈనెల 12న సాక్షి పత్రికలో వచ్చిన కథనానికి స్పందించిన విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు. చింతాయపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గతంలో పీఈటీ, ఎన్‌సీసీ ఆర్గనైజర్‌గా ఎం.గోపి వ్యవహరించారు. ప్రస్తుతం వెనిగండ్లలో పీఈటీగా పని చేస్తున్నారు. చింతాయపాలెం హైస్కూలులో పని చేస్తున్న సమయంలో ఎన్‌సీసీ విద్యార్థుల సర్టిఫికెట్ల మంజూరులోనూ, యూనిఫాం అలెవెన్స్‌లో అవకతవకలకు పాల్పడ్డారని కొంతమంది విద్యార్థులు, పేరెంట్స్ ఆర్జేడీకి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాలతో జిల్లా విద్యాశాఖాధికారి పురుషోత్తం ఉత్తర్వుల మేరకు స్థానిక పాఠశాలలో జిల్లా డెప్యూటీ డీఈవో కె.సురేష్ సోమవారం ప్రధానోపాధ్యాయుడు, వేణుమాధవ్, ఎంఈవోలు మనోరంజని, విద్యాశ్రీల సమక్షంలో విచారణ చేపట్టారు.
తల్లిదండ్రుల స్టేట్‌మెంట్లు నమోదు
ఈ సందర్భంగా డెప్యూటీ డీఈవో మాట్లాడుతూ విచారణకు వచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రుల స్టేట్‌మెంట్లు నమోదు చేశామని, వీటిని ఉన్నతాధికారులకు సమర్పించినట్లు తెలిపారు.
పాఠశాల బయట ఘర్షణ
పాఠశాల బయట చింతాయపాలెం ఎస్‌ఎంసీ వైస్ చైర్మన్ నాగలక్ష్మి, ఆమె కుమార్తె అనూరాధ, నంబూరు వ్యాయామ ఉపాధ్యాయుడు మస్తాన్‌రెడ్డి ఘర్షణ పడ్డారు. గతంలో వెనిగండ్ల పీఈటీగా పనిచేసిన సమయంలో ఆయన సస్పెండ్ అయ్యారు. ఈ నేపథ్యంలో మస్తాన్‌రెడ్డి, వైస్ చైర్మన్ పిట్టు నాగలక్ష్మి, ఆమె కుమార్తె అనూరాధల మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణకు దారితీసింది. ఇందులో నాగలక్ష్మికి, మస్తాన్‌రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. తన అబ్బాయి అయ్యప్పరెడ్డి సర్టిఫికెట్ కోసం కుమార్తె అనూరాధతో కలసి పాఠశాలకు వచ్చినట్లు నాగలక్ష్మి తెలిపారు. ఈ సమయంలో దూరం నుంచి మస్తాన్‌రెడ్డి తమ ఫొటోలు తీస్తున్నాడని, దీన్ని ప్రశ్నించినందుకు తనపై దాడి చేశాడని నాగలక్ష్మి అంటోంది.
అన్యాయంగా సస్పెన్షన్
మస్తాన్‌రెడ్డి మాట్లాడుతూ తాను వెనిగండ్ల పీఈటీగా పనిచేసి నంబూరు పాఠశాలకు బదిలీపై వెళ్లానని తెలిపారు. వెనిగండ్లలో పనిచేస్తున్న సమయంలో అవకతవకలకు పాల్పడ్డానని పీఈటీ గోపి తన మీద అధికారులకు లేనిపోనివి చెప్పి పత్రికల్లో రాయించినట్లు ఆరోపించారు. దీంతో అధికారులు సస్పెండ్ చేసినట్లు వాపోయారు. గోపీపై విచారణను పత్రికల ద్వారా తెలుసుకుని వచ్చానని, తనకు జరిగిన అన్యాయాన్ని విచారణ కమిటీకి చెప్పుకునేందుకు వచ్చి పాఠశాల బయట కారులో కూర్చున్నట్లు వివరించారు.
నాగలక్ష్మి కూతురు అనూరాధ మొబైల్‌తో తన వీడియో తీస్తుండగా, తాను కూడా ఫోన్‌తో ఫొటో తీసే ప్రయత్నం చేసినట్లు చెప్పారు. అనూరాధ, నాగలక్ష్మి ఫోన్ లాక్కుని పగలకొట్టి, షర్టు చించి దాడి చేశారని మస్తాన్ రెడ్డి ఆరోపించారు. దాడిపై కర్లపాలెం ఎస్‌ఐ రవీంద్రను వివరణ అడుగ్గా ఘర్షణ, దాడి జరిగిన మాట వాస్తవమేనని తెలిపారు. ఇద్దరు ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

గుటకాయ‘స్వాహా’పై విచారణ

గుటకాయ‘స్వాహా’పై విచారణ