కొత్త టీచర్లు వస్తున్నారు
గుంటూరు ఎడ్యుకేషన్ : ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. డీఎస్సీ–2025లో ఎంపికై న అభ్యర్థుల జాబితాను విద్యాశాఖ విడుదల చేసింది. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 1,140 పోస్టులను భర్తీ చేయనున్నట్లు జాబితాలో పొందుపర్చారు. వాస్తవానికి ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్, మున్సిపల్ పాఠశాలల్లో 1,159 ఖాళీలు ఉన్నట్లు డీఎస్సీ నోటిఫికేషన్‌లో చూపగా, 19 పోస్టులకు అభ్యర్థులు లేకపోవడంతో వాటిని భర్తీ చేయకుండా నిలిపివేశారు.
ఒకటికి మించి రెండు, మూడు పోస్టులకు ఎంపికై న అభ్యర్థులు ఉండగా, దరఖాస్తు సమయంలో ఇచ్చిన ఆప్షన్ ఆధారంగానే వారిని ఒక పోస్టుకు ఎంపిక చేశారు. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికై న అభ్యర్థులు దరఖాస్తు సమయంలో ఎస్జీటీ పోస్టును ఎంపిక చేసుకుని ఉంటేవారిని హైస్కూళ్లలో స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు బదులుగా ప్రాథమిక పాఠశాలల్లో ఎస్జీటీగానే ఎంపిక చేసి, నియామకపత్రాలు వెబ్‌సైట్‌లో పెట్టారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్ 620, ఎస్జీటీ 520 ఉన్నాయి.
డీఎస్సీ–2025 ద్వారా ఎంపికై న అభ్యర్థులకు ఈనెల 22 నుంచి ఇండక్షన్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దసరా సెలవుల తరువాత పాఠశాలలను కేటాయించి, సంబంధిత ఉపాధ్యాయులను పాఠశాలలకు పంపనున్నారు.
డీఎస్సీ 2025 ఎంపిక జాబితా విడుదల ఉమ్మడి గుంటూరు జిల్లాలో 1,140 పోస్టులు భర్తీ విద్యాశాఖ వెబ్‌సైట్‌లో ఎంపిక జాబితా ఈ నెల 22 నుంచి శిక్షణ తరగతులు
దరఖాస్తు సమయంలో ఇచ్చిన ఆప్షన్
ఆధారంగానే పోస్టింగ్స్
ఈనెల 22 నుంచి ఇండక్షన్ శిక్షణ
డీఈవో సైట్‌లో డీఎస్సీ– 2025 ఎంపిక జాబితా
గుంటూరు జిల్లాలో డీఎస్సీ–2025 ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన అన్ని కేటగిరీల వారీగా ఎంపిక జాబితాను డీఈవోజీన్‌టీ.బ్లాగ్‌స్పాట్.కామ్‌లో ఉంచినట్లు జిల్లా విద్యాశాకాధికారి సీవీ రేణుక సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికై న అభ్యర్థులు జాబితాను పరిశీలించుకోవాలని సూచించారు. అదే విధంగా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంతో పాటు జిల్లా కలెక్టరేట్‌లోని డిస్‌ప్లే బోర్డులలో జాబితాను ఉంచామని, అదనపు సమాచారం కోసం డీఈవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌లో సంప్రదించాలని సూచించారు.