
మెడికల్ కళాశాలలను అమ్ముకుంటున్నారు
దాచేపల్లి: చంద్రబాబు ప్రభుత్వం లంచాలకు ప్రభుత్వ మెడికల్ కళాశాలను అమ్ముకుంటుందని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో ఎవరైతే లంచాలు ఇచ్చి మెడికల్ కాలేజీలను లీజుకు తీసుకున్నారో.. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి వాటిని స్వాధీనం చేసుకుంటామని ఆయన హెచ్చరించారు. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయిన వెంటనే కాలేజీలను ప్రభుత్వం ద్వారానే నడిపించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సంపద సృష్టిస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రూ.8 వేల కోట్లు విలువ చేసే 17 మెడికల్ కాలేజీలను తన చెంచాలకు అప్పగిస్తున్నాడని, దీనిపై తప్పనిసరిగా సీబీఐ, ఈడీ విచారణ ఉంటుందని మహేష్ రెడ్డి హెచ్చరించారు. తమ ఐదేళ్ల పాలనలో రెండేళ్లు కోవిడ్ పోతే మిగిలిన మూడు సంవత్సరాల్లో నాలుగైదు కాలేజీలు పూర్తి కాగా మరికొన్ని కాలేజీలు 60 నుంచి 80 శాతం వరకు నిర్మాణాలు పూర్తి చేసుకున్నాయని వివరించారు.
పిడుగురాళ్ల కాలేజీ 60 శాతం పూర్తి
పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ 60 శాతం పూర్తి కాగా హాస్పిటల్ 90 శాతం పూర్తి అయిందని ఆయన చెప్పారు. 1923 నుంచి 2019 వరకు 96 సంవత్సరాలలో ఆంధ్ర రాష్ట్రంలో కేవలం 12 ప్రభుత్వం మెడికల్ కాలేజ్ ఉంటే వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సీఎం అయిన తరువాత 17 మెడికల్ కళాశాలను నెలకొల్పారని ఆయన అన్నారు. చంద్రబాబుకు చేతనైతే పూర్తి చేసి కళాశాలలను నడిపించాలని సవాల్ విసిరారు. ఒక్కొక్క మెడికల్ సీటు రూ.30 నుంచి 40 లక్షలకు అమ్ముకునేదానికి ఆ కాలేజీ ఎవరికై తే ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్నారో వారికి అనుమతులు ఇస్తున్నట్లుగా మీడియాలో కథనలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సుమారుగా ఐదేళ్లలో రూ.20 నుంచి రూ.30 వేల కోట్లు సంపదను సృష్టిస్తూ పోతే దాన్ని ఈరోజు అప్పనంగా అమ్ముకుంటున్నారని మహేష్ రెడ్డి ధ్వజ మెత్తారు.
టీడీపీ నాయకులకు మెదడు
పనిచేయడం లేదు
ఎక్కడో అమరావతిలోనో, .గుంటూరులో ఏసీ రూములో కూర్చుని విమర్శలు చేసే తెలుగుదేశం నాయకులకు తాను ఛాలెంజ్ విసురుతున్నానని, టీడీపీ నాయకులకు దమ్ముంటే గురజాల గల్లీకి రావాలని, పిడుగురాళ్లలో ఉన్న కాలేజీ ఎలా పూర్తి చేశామో చూపిస్తామన్నారు. ఇప్పుడెందుకు మెడికల్ కళాశాలలను అమ్ముకుంటున్నారో ప్రజలందరికి తెలుసని, నిర్మాణం పూర్తి చేసుకున్న పులివెందుల మెడికల్ కళాశాలలో సీట్లు కేటాయిస్తామని చెబితే చంద్రబాబు ప్రభుత్వం సీట్లు కేటాయించవద్దని లేఖ రాయటం వాస్తవం కాదా? అని మహేష్ రెడ్డి ప్రశ్నించారు. రూ 500 కోట్ల విలువ చేసే ఒక్కో కాలేజీని కేవలం రూ.50 కోట్లకు అమ్ముకొని మరో రూ.200 కోట్లు లంచాలు తీసుకునేందుకే చంద్రబాబు ప్రభుత్వం కుట్ర చేస్తుందని మహేష్‌రెడ్డి మండిపడ్డారు. టీడీపీ నాయకులకు మెదడు సరిగ్గా పనిచేయటం లేదని, తెలుగుదేశం నాయకులు చేసే చౌకబారు విమర్శలకు తాము స్పందించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో భాగస్వామిగా ఉన్న టీడీపీ నాయకులు కొత్తగా మంజూరైన 17 మెడికల్ కాలేజీలకు ఒక్కో దానికి రూ.200 కోట్లు కూడా తీసుకురాలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఈ నిధులు తెస్తే అన్ని కళాశాల నిర్మాణాలు పూర్తి అవుతాయని మహేష్ రెడ్డి పేర్కొన్నారు. రూ.లక్షల కోట్ల అప్పు చేసి అమరావతిలో పెడుతున్నప్పుడు రూ.3 వేల కోట్లు అప్పుచేసి విద్య, వైద్యానికి ఎందుకు పెట్టారని ఆయన ప్రశ్నించారు. వెనుకబడిన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఈ మెడికల్ కళాశాలల నిర్మాణాలు కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తే ఆ ప్రాంతాలలోని నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయి అన్నారు. మెడికల్ కళాశాల మంజూరులో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలకు ఎటువంటి సంబంధం లేదని, గత ప్రభుత్వంలో జవహర్‌రెడ్డి పట్టు పట్టి ఈ కళాశాలను మంజూరు చేయించారని మహేష్ రెడ్డి గుర్తు చేశారు.
రూ.200 కోట్ల వసూలుకు పన్నాగం
సీటు రూ.50 లక్షలకు అమ్ముకునేలా ప్రైవేటు వ్యక్తులకు అవకాశం
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రాగానే
మెడికల్ కళాశాలల స్వాధీనం
గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి