
బీసీల హామీలను నెరవేర్చాలి
బాపట్ల అర్బన్: ఎన్నికల ముందు బీసీలకు చేసిన వాగ్దానాలను అమలుపరచడంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధి చూపాలని బీసీల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, ఇన్‌చార్జ్ అధ్యక్షుడు బాపట్ల రవికుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో సంఘం ఆధ్వర్యంలో ఇన్‌చార్జ్ జేసీ గంగాధర్‌కు పలువురు బీసీ నేతలు సోమవారం వినతిపత్రం అందజేశారు. ముందుగా చీలు రోడ్డు కూడలిలో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం ప్రదర్శనగా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు పిలుపు మేరకు వినతి పత్రాన్ని అందజేశామని తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల ముందు బీసీలకు కేటాయిస్తామన్న 34 శాతం రిజర్వేషన్‌ను స్థానిక సంస్థల్లో అమలు పరచాలని కోరారు. ఎస్సీ, ఎస్టీలకు ఏ విధమైన అట్రాసిటీ చట్టం ఉందో బీసీలకు కూడా ఆ మాదిరిగానే రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. జనాభా దామాషా లెక్కల ప్రకారం రిజర్వేషన్లను అమలు పరచాలని, బీసీ కులగణన నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా భాజాపా ఓబీసీ జిల్లా అధ్యక్షుడు కొక్కిలగడ్డ శ్రీనివాసరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో బీసీలకు కేటాయిస్తానన్న నిధులను వెంటనే మంజూరు చేయాలని కోరారు. అగ్నికుల క్షత్రీయుల కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అనాదిగా అణిచివేతకు గురవుతున్న బీసీలకు రక్షణ చట్టం కావాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కేటాయింపుపై ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. భాజపా మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీఎల్ మోహన్ గౌడ్ మాట్లాడుతూ ప్రాదేశికంగా నియోజకవర్గాల విభజన పూర్తి చేసి, జనాభా దామాషా లెక్కల ప్రకారం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కేటాయించాలని కోరారు. రాష్ట్ర రాజధానిలో మహాత్మ జ్యోతీరావు పూలే, సావిత్రీ బాయి పూలే స్మృతివనాన్ని అద్భుత కళాఖండంగా దేశం గర్వించే రీతిలో నిర్మాణం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బీసీ నేతలు ఉల్చి శ్రీను, కంకణాల రాంబాబు, రామ్మోహనరావు, ప్రత్తిపాటి సాయికుమార్ పాల్గొన్నారు.
జేసీకి సంఘ నాయకుల వినతిపత్రం