
రాత్రి ప్రతిష్ఠ .. తెల్లారి తొలగింపు
మార్టూరు: బాపట్ల జిల్లా మార్టూరు మండలం డేగరమూడిలో ఆదివారం అర్ధరాత్రి ప్రతిష్ఠించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి అనుమతులు లేవంటూ సోమవారం అధికారులు తొలగించారు. వివరాలు ఇలా ఉన్నాయి... స్థానిక జగనన్న కాలనీ సమీపంలోని రెండు సెంట్ల భూమిని పంచాయతీ సర్పంచ్ జంపని అంజమ్మ వార్డు సభ్యుల సంతకాలతో తీర్మానం చేయించి, గత నెలలో అంబేడ్కర్ విగ్రహ నిర్మాణానికి సహకరించారు. సెప్టెంబర్ మొదటి వారంలో దళిత నాయకులతో కలిసి మార్టూరు మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ జంపని వీరయ్య చౌదరి ఆధ్వర్యంలో విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో అధికారులు విగ్రహ స్థాపనకు అనుమతులు లేవంటూ గ్రామస్తులకు, పంచాయతీ కార్యాలయానికి తెలిపారు. ఈ నేపథ్యంలో గత ఆదివారం అర్ధరాత్రి కొందరు వ్యక్తులు శంకుస్థాపన స్థలంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. సోమవారం ఉదయం ఆర్‌ఐ అశోక్, వీఆర్‌ఏ ఏడుకొండలు విగ్రహ ప్రతిష్ఠ స్థలాన్ని పరిశీలించి, ఈఓఆర్డీ రామాంజనేయులుకు విషయం తెలిపారు. ఆయన సూచనల మేరకు సచివాలయ కార్యదర్శి మరికొందరితో వచ్చి మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి పంచాయతీ కార్యాలయంలో ఓ గదిలో ఉంచి తాళం వేసి వెళ్లిపోయారు. ఈ విషయమై ఈఓఆర్డీ రామాంజనేయులును విలేకరులు వివరణ కోరగా విగ్రహ ప్రతిష్ఠ కోసం పంచాయతీ సభ్యులు తీర్మానం చేసిన భూమి గ్రామ కంఠానికి నికి చెందిన ప్రభుత్వ భూమి అని తెలిపారు. పంచాయతీ తీర్మానం ఉన్నప్పటికీ ఎంపీడీవో, పంచాయతీరాజ్ అధికారులు పోలీస్ డిపార్ట్‌మెంట్ తదితర శాఖలతో కూడిన మండల కమిటీ అనుమతులు తీసుకోవాలని తెలిపారు. అనంతరం జాయింట్ కలెక్టర్ అనుమతులతో విగ్రహ నిర్మాణం చేపట్టాలని, గ్రామంలో ఇవేమి లేకుండా అర్ధరాత్రి విగ్రహ ప్రతిష్టాపన జరిగినట్లు ఆయన తెలిపారు.
డేగరమూడిలో అంబేడ్కర్ విగ్రహాన్ని తొలగించిన అధికారులు

రాత్రి ప్రతిష్ఠ .. తెల్లారి తొలగింపు