
గుర్తు తెలియని వాహనం ఢీకొని రైతు మృతి
చిలకలూరిపేటటౌన్: రోడ్డు ప్రమాదంలో రైతు మృతి చెందిన సంఘటన పట్టణ పరిధిలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కోండ్రుపాడు గ్రామానికి చెందిన రైతు ఇంటూరి యాదగిరి(27) సరుకుల నిమిత్తం గ్రామం నుంచి బైక్‌పై చిలకలూరిపేటకు బయలుదేరాడు. కొత్త హైవే బైపాస్ వంతెన సమీపంలోని రైస్‌మిల్లు సమీపానికి వచ్చే సరికిగా ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసిన గుర్తు తెలియని వాహనం ఇతని బైక్‌ను ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడిన యాదగిరి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య పద్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదివారం అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సీబీఐ పేరుతో ఓ వ్యాపారికి రూ.62.25 లక్షలు టోకరా
లక్ష్మీపురం: నగరంలోని ప్రముఖ వ్యాపారికి సీబీఐ పేరుతో రూ.62.25 లక్షలు టోకరా వేశారు. ఈ ఘటనపై అరండల్‌పేట పోలీసులు ఆదివారం రాత్రి కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు నగరంలోని భారత్‌పేట ప్రాంతానికి చెందిన ఓ కన్‌స్ట్రక్షన్ వ్యాపారం చేసే వ్యక్తికి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఉత్తర్‌ప్రదేశ్ పోలీసు డిపార్ట్‌మెంట్ నుంచి, టెలికాం డిపార్ట్‌మెంట్, సీబీఐ నుంచి మాట్లాడుతున్నామని వాట్సాప్ కాల్స్, వీడియో కాల్స్ చేశారు. మనీ లాండరింగ్ కేసులో ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు, అతని వద్ద మీ పూర్తి వివరాలు ఉన్నాయని ఇరువురి మధ్య నగదు లావాదేవీలు జరిగినట్లుగా ఆరోపణలు ఉన్నట్లు తెలిపారు. ఆ కేసులో అరెస్టు చేస్తామని బెదిరించారు. అరెస్టు చేయకుండా ఉండాలంటే, కేసులో క్లియరెనన్స్ ఇవ్వాలి అంటే డబ్బులు ఇవ్వాలంటూ వ్యాపారి నుంచి పలు దఫాలుగా మొత్తం రూ.62.25 లక్షలు వసూలు చేశారు. అయినా గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌లు చేసి బెదిరిస్తూనే ఉన్నారు. దీంతో వ్యాపారి దిక్కుతోచక ఆదివారం రాత్రి అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నేడు జూనియర్ కళాశాలల ఫిజికల్ డైరెక్టర్ల సమావేశం
గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా అండర్ –19 స్కూల్ గేమ్స్ జూనియర్ కళాశాలల ఫిజికల్ డైరెక్టర్ల సమావేశాన్ని సోమవారం గుంటూరులోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు జిల్లా వృత్తి విద్యాధికారి జె.పద్మ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని ప్రభుత్వ, హైస్కూల్ ప్లస్, ప్రైవేటు కళాశాలల్లో పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయులందరూ హాజరై ప్రస్తుత విద్యా సంవత్సరంలో జరగబోవు ఉమ్మడి గుంటూరు జిల్లా సెలక్షన్‌న్స్ వేదికలతోపాటు తేదీలను ఖరారుపై చర్చించాల్సి ఉందని పేర్కొన్నారు. ఫిజికల్ డైరెక్టర్‌ను రిలీవ్ చేసి సోమవారం ఉదయం 10 గంటలకు సమావేశానికి పంపాలని ఆయా యాజమాన్యాల్లోని కళాశాలల ప్రిన్సిపాల్స్‌ను ఆదేశించారు.
యోగాసన పోటీలలో జెడ్పీ హైస్కూల్ విద్యార్థుల ప్రతిభ
తాడికొండ: రాష్ట్రస్థాయిలో నిర్వహించిన 50వ యోగాసన స్పోర్ట్స్ ఫెడరేషన్ పోటీలలో తమ పాఠశాల విద్యార్థినులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఐదుగురు ఎంపికయ్యారని ఉపాధ్యాయులు తెలిపారు. ఈ నెల 6–7 తేదీల్లో ద్వారకా తిరుమలలో నిర్వహించిన ఈ పోటీల్లో జూనియర్ విభాగంలో మొక్కల అక్షయ ప్రథమ, ఆలా పూజిత తృతీయ, బొంత అనూష నాలుగో స్థానాలు సాధించగా సబ్ జూనియర్ విభాగంలో మొక్కల లక్ష్మీ ఆశ్రిత నాలుగో స్థానం సాధించినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థినులతోపాటు యోగా అభ్యాసకుడు అన్నవరపు రాకేష్‌లను పాఠశాల హెచ్‌ఎం, ఉపాధ్యాయులు అభినందించారు. త్వరలో వీరు జాతీయ స్థాయి యోగా పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.
నెహ్రూనగర్: ప్రభుత్వం తీసుకోచ్చిన నూతన బార్ పాలసీపై కొంత మంది తమ స్వార్థంతో, ఇతరులు కొత్తవారు బార్ బిజినెస్‌లోకి రాకుండా అడ్డుకునేందుకు చెడు ప్రచారం చేస్తున్నారని అటువంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ డెప్యూటీ కమిషనర్ డాక్టర్ కె. శ్రీనివాస్ తెలియజేశారు. ఆదివారం బ్రాడీపేటలోని ఎకై ్సజ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గుంటూరు జిల్లాలో 53 మంది, పల్నాడు జిల్లాలో 24 మంది బార్ లైసెన్సులు తీసుకొని చక్కగా వ్యాపారం చేస్తున్నారని తెలియజేశారు. ఈ నెల 14వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని, 15న కలెక్టరేట్‌లో లాటరీ ద్వారా షాపుల కేటాయింపు జరుగుతుందని తెలిపారు. సమావేశంలో ఈఎస్ అరుణకుమారి, ఏఈఎస్ మారయ్యబాబు పాల్గొన్నారు.