
అతివేగానికి రెండు ప్రాణాలు బలి
ద్విచక్రవాహనంతో ట్రాక్టర్‌ను ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకుల దుర్మరణం మృతుడు షారోన్ పల్నాడు జిల్లా వాసి విజయవాడ– మచిలీపట్నం రహదారిపై రోడ్డు ప్రమాదం
గూడూరు: అతివేగం రెండు ప్రాణాలు బలి తీసుకుంది. ఇటుకల లోడు ట్రాక్టర్‌ను ద్విచక్ర వాహనం వెనుక నుంచి ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ ఘటన శనివారం విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారిపై గూడూరు మండలం తరకటూరు దగ్గర జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జీవనోపాధి కోసం విజయవాడ సమీపంలోని పెనమలూరు మండల పరిధిలో నివాసం ఉంటున్న పరిమి ఆదామ్ బాబు(19), కొమ్మవరపు షారీన్(19), కోట కౌషిక్(21) శనివారం ద్విచక్ర వాహనంపై మంగినపూడి బీచ్‌కు బయలుదేరారు. మధ్యాహ్న సమయంలో పామర్రు మండలం నిమ్మకూరు నుంచి ఇటుకల లోడుతో మచిలీపట్నం వైపు వెళ్తున్న ట్రాక్టర్‌ను వేగంగా వచ్చి బలంగా ఽఢీకొట్టారు. దీంతో వాహనం నడుపుతున్న ఆదామ్‌బాబుతోపాటు వెనుక కూర్చున్న, కొమ్మవరపు షరీన్, కోట కౌషిక్ తీవ్ర గాయాలపాలయ్యారు. తలకు బలమైన గాయమవడంతో ఆదామ్‌బాబు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందగా, షరీన్ 108లో మచిలీపట్నం ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచాడు. కౌషిక్‌కు ప్రాణాపాయం లేదని వైద్యులు నిర్ధారించారు. ప్రమాద విషయం తెలుసుకున్న పెడన సీఐ నాగేంద్ర కుమార్, సిబ్బందితో ఘటనా స్థలానికి వచ్చి పరిస్థితి సమీక్షించారు. గూడూరు ఎస్‌ఐ కె.ఎన్.వి.సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బందరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిమి ఆదామ్ బాబు(19), కోట కౌశిక్(21) స్వస్థలం ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం పొన్నవల్లి గ్రామం కాగా, కొమ్మవరపు షారోన్(21) స్వస్థలం పల్నాడు జిల్లా అంబడిపూడి. సమీప బంధువులు అయ్యే వీరు ముగ్గురు జీవనోపాధి కోసం విజయవాడకు వచ్చినట్టు పోలీసు విచారణలో వెల్లడైంది.

అతివేగానికి రెండు ప్రాణాలు బలి