
పకడ్బందీగా యూరియా పంపిణీ
జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పంపిణీ కేంద్రాలను నిత్యం తనిఖీ చేయాలి పంటలు వేసిన మండలంలోనే రైతులకు యూరియా అందజేయాలి ఫిర్యాదులకు కంట్రోల్ రూం ఏర్పాటు
బాపట్ల: జిల్లాలో రైతులకు ఇబ్బంది లేకుండా పకడ్బందీగా యూరియాను పంపిణీ చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి శనివారం సాయంత్రం ఆర్‌డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మండల వ్యవసాయ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సోమవారం నుంచి ఆదివారం వరకు ఎంత యూరియా అవసరముందో మండల వ్యవసాయ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు. గత సంవత్సరంలో సాగు, ఈ ఏడాది సాగును అంచనా వేసుకుని, దానికనుగుణంగా తెప్పించుకోవాలని ఆయన తెలిపారు. మండలానికి వచ్చిన స్టాకు, రైతు కేంద్రాలకు పంపిణీని ప్రతిరోజు రిజిస్టర్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. రైతులు ఏ మండలంలో వ్యవసాయం చేస్తున్నారో అక్కడే పంపిణీ చేయాల్సిన బాధ్యత మండల వ్యవసాయ అధికారులదేనని ఆయన స్పష్టం చేశారు. మండలాలలో ఇప్పటి వరకు చేసిన యూరియా పంపిణీ, ఇంకా ఎంత అవసరం ఉందో అంచనాలు వేసుకోవాలని తెలిపారు. మండలానికి ఎంత అవసరం ఉందో అంతే ఇస్తామని స్పష్టం చేశారు. ఎరువుల కొరత, అధిక ధరల వసూలుపై కంట్రోల్ రూం (82470 40131) నంబర్‌కు ఫోన్ చేసేలా రైతులకు అవగాహన కలిగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి యూరియా పంపిణీ కేంద్రం వద్ద గ్రామ వ్యవసాయ అధికారి, వీఆర్వో, వీఆర్‌ఏ, ఒక పోలీస్ అధికారి ఉంటూ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు. ఎవరికై నా ఎక్కువ ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.జాయింట్ టాస్క్ ఫోర్స్ కమిటీ ప్రతిరోజు రైతు కేంద్రాలను పరిశీలించాలని ఆయన చెప్పారు. రైతు కేంద్రాలకు వచ్చే రైతులకు ముందుగానే టోకెన్లు ఇవ్వాలని, అందరికీ ఉన్న యూరియా చాలకపోతే వారికి ముందుగానే సమాచారం తెలియజేయాలని చెప్పారు. కార్యక్రమంలో ఏడీఏ అన్నపూర్ణ, జిల్లా మార్క్‌ఫెడ్ డీఎం కరుణశ్రీ పాల్గొన్నారు.
యూరియా సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టండి !
యూరియా సరఫరాపై వ్యవసాయ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. శనివారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో గల మార్క్‌ఫెడ్ స్టాక్ స్టోర్ అవేజ్ గౌడౌన్‌ను ఆయన తనిఖీ చేశారు. జిల్లాకు వచ్చిన యూరియా, ప్రస్తుత నిల్వలు, రైతు సేవా కేంద్రాలు, పీఏసీఎస్, డీసీఎంఎస్‌లకు పంపిణీపై అధికారులను ఆరా తీశారు. యూరియా పంపిణీలో సమస్యల గురించి వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అవేజ్ గౌడౌన్ నుంచి సక్రమంగా రైతు సేవా కేంద్రాలు, పీఏసీఎస్, డీసీఎంఎస్‌లకు యూరియాను పంపాలని ఆయన ఆదేశించారు. సీఎంఏఐడీ యాప్ ద్వారా రైతులకు యూరియాను అందజేయాలని చెప్పారు. యూరియా కొనుగోలులో సమస్యలు, అధిక ధరల అమ్మకాలకు సంబంధించి రైతులు వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. ఎరువుల కోసం వచ్చే రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.

పకడ్బందీగా యూరియా పంపిణీ