
జ్వరాలు ప్రబలకుండా జాగ్రత్తలు పాటించాలి
డీఎం అండ్ హెచ్‌ఓ విజయమ్మ
కొల్లూరు : జ్వరాలు ప్రబలకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని డీఎం ఆండ్ హెచ్‌ఓ విజయమ్మ తెలిపారు. కొల్లూరు పీహెచ్‌సీని శనివారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలో డెంగీ, మలేరియా జ్వరాల జాడ లేదని, అయితే వైరల్ ఫీవర్స్ కేసులు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. దీనికి ప్రధాన కారణం ఇటీవల కృష్ణా నదికి వరదలు కావచ్చన్నారు. భూగర్భ జలాలు పెరిగిన పక్షంలో ఇన్‌ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువుగా ఉండొచ్చని వివరించారు. జ్వరాలు బారిన ప్రజలు పడకుండా తాగునీటిని కాచి చల్లార్చిన తర్వాతే తాగాలని సూచించారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమకాటు బారిన పడకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. ప్రతి గ్రామంలో తాగునీటి నమూనాలను సేకరించి రీజినల్ రీసెర్చ్ సెంటర్‌కు పంపించాలని వైద్యాధికారిణిని ఆదేశించారు. పంచాయతీ, మండల పరిషత్తు అధికారులతో సమన్వయం చేసుకొని పరిశుభ్రమైన తాగునీరు పంపిణీకి కృషి చేస్తామన్నారు. దోమల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టే విధంగా పర్యవేక్షణ చేస్తామని తెలిపారు. ప్రజలు కూడా ఆర్‌ఎంపీలను ఆశ్రయించకుండా ప్రభుత్వ వైద్యశాలలో లేదా నిపుణులైన వైద్యుల వద్దకు వెళ్లి చికిత్స పొందాలని ఆమె సూచించారు. ఆర్‌ఎంపీలు కూడా జ్వరంతో వచ్చిన వారికి ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని, హైడోస్ ఇంజక్షన్లు, ఫ్లూయిడ్స్, స్టెరాయిడ్స్ వాడరాదని హెచ్చరించారు. హెవీ డోస్ ఇంజక్షన్లు, మందులు వినియోగంతో జ్వర తీవ్రత తాత్కాలికంగా తగ్గినప్పటికీ, కొద్ది రోజుల్లోనే తిరిగి తిరగపెట్టడం, రోగ నిరోధకశక్తి తగ్గిపోతుందని తెలిపారు.