
వైభవంగా బీచ్ ఫెస్టివల్ నిర్వహణ
బాపట్ల: బీచ్ ఫెస్టివల్‌ను అంగరంగ వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. నిర్వహణపై అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులతో శుక్రవారం తన చాంబర్‌లో సమీక్ష నిర్వహించారు. ఈనెల 26, 27, 28 తేదీల్లో సూర్యలంక, రామాపురంలో బీచ్ ఫెస్టివల్‌ను
నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దక్షిణ భారత స్థాయిలో బీచ్ క్రీడా పోటీలు నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వేడుకలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ఫెడ్ లైట్ల మధ్య వాలీబాల్, ఖోఖో, బాక్సింగ్, ఫెన్సింగ్ తదితర క్రీడా పోటీలు భారీ స్థాయిలో నిర్వహించాలని చెప్పారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో పండుగలా జరపాలని ఆయన సూచించారు. పర్యాటకుల సౌకర్యార్థం 100 ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. సాంస్కృతిక కార్యక్రమాల కోసం తెలుగు సినీ రంగం నుంచి కళాకారులను పిలిపిస్తున్నట్లు పేర్కొన్నారు. మధ్యలో సరదాగా ఉండడానికి జబర్దస్త్ బృందాల ప్రదర్శన ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రసిద్ధ గాయకులతో పాటు సినీ రంగ నటులు, ప్రముఖుల సైతం ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలని కలెక్టర్ తెలిపారు. డాన్సర్లు, మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేయాలన్నారు. తీర ప్రాంతంలో బోట్ల ప్రదర్శన, స్పీడ్ బోట్లు, స్పోర్డ్స్ రైడర్స్, గుర్రాలు, ఒంటెలు ప్రదర్శన ఉంచాలని సూచించారు. వేడుకలకు హాజరయ్యే ప్రజలకు అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా తాగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు. 350 మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. వేలాదిమంది కార్యక్రమానికి హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి డెప్యూటీ కలెక్టర్ జి.గంగాధర్ గౌడ్, జిల్లా పర్యటకశాఖ అధికారి నాగిరెడ్డి, ఆర్డీవో గ్లోరియా, మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, కలెక్టరేట్ ఏవో మల్లికార్జునరావు, పాల్గొన్నారు.
అధికారులకు
కలెక్టర్ జె.వెంకట మురళి ఆదేశం