
కదిలిస్తే ఉబుకుతున్న క‘న్నీళ్లు’
తురకపాలెం చుట్టూ అక్రమ నీటి విక్రయాలు ప్రజలకు మాత్రం క్వారీ గుంతలో నీళ్లు
గుంటూరు రూరల్: తురకపాలెం చుట్టూ అక్రమ నీటి విక్రయ కేంద్రాల నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నా గ్రామస్తులకు మాత్రం చుక్క నీరు దొరకడం లేదు. క్వారీ గుంతల్లో నీటిని సరఫరా చేస్తున్నారు. గ్రామం నలువైపులా 20కి పైగా అక్రమ నీటి విక్రయ కేంద్రాలు ఉన్నాయి. సుమారు 300 అడుగుల నుంచి 400 అడుగుల లోతు వరకూ బోర్లను ఏర్పాటు చేసి అక్రమార్కులు నీటి విక్రయాలను చేపడుతున్నారు. ప్రతి రోజు సుమారు 500 వందల ట్యాంక్‌ల నీటిని గుంటూరు నగరంలోని అపార్ట్‌మెంట్లు, పలు ప్రైవేటు కళాశాలలకు, హాస్టల్స్‌కు, నిర్మాణాలకు సరఫరా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. నిత్యం 40 లక్షల లీటర్ల విక్రయాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ట్యాంకర్‌ను రూ. 1000 నుంచి రూ.1500 వరకూ విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.
24 గంటలు నీటి తోడకం
బోర్లను 400 అడుగుల లోతు వరకూ ఏర్పాటు చేసి 24 గంటలు నీటిని తోడటంతో గ్రామస్తులు ఇళ్లలో వేసుకున్న బోర్లకు నీరు అందటం లేదు. గ్రామస్తులు 100 అడుగుల నుంచి 150 అడుగుల లోతు వరకూ మాత్రమే బోర్లను ఏర్పాటు చేసుకోవటంతో నీరందక అవస్థలు పడుతున్నారు. వేసవిలో నానా పాట్లు పడుతున్నారు. భూగర్బ జలాలు అడుగంటి బోర్లు మూగబోతున్నాయి. అనుమతులు లేకుండా భూగర్భ జలాలను విక్రయిస్తున్నా అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో జోగుతున్నారు.
ఐదు నెలల కిందట ఫిర్యాదు
గ్రామానికి సరఫరా చేస్తున్న నీరు మురికిగా వస్తోందని ప్రజలు ఐదు నెలల కిందట ఉన్నతస్థాయి అధికారులకు ఫిర్యాదు చేశారు.అయినా స్పందన లేదు. గత్యంతరం లేక క్వారీ గుంతల్లో నిల్వ చేసిన నీటిని వాడుకుంటున్నారు. క్వారీల్లో బ్లాష్టింగ్ వ్యర్థాలు, మురుగు నీరు కలిసి ప్రజలు చర్మవ్యాధులు, విషజ్వరాల బారిన పడుతున్నారు.
నీటి కాలుష్యంపై
గ్రామంలో చర్చలు
గ్రామంలో ప్రస్తుతం ఉన్న బ్యాక్టీరియా నీటిని ట్యాంకుల ద్వారా నగర ప్రజలకు అమ్ముతున్నారని, ఆ నీటిని వినియోగిస్తున్నవారి పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. అక్రమ సంపాదన కోసం నిర్వహిస్తున్న నీటి విక్రయాలను నిలిపి వేయాలని, తమకు మంచినీటిని అందించాలని ప్రజలు కోరుకుంటున్నారు. గ్రామంలోని నీటిని ప్రజలకు అందించకుండా విక్రయాలు చేపడుతున్నవారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

కదిలిస్తే ఉబుకుతున్న క‘న్నీళ్లు’