
యువత భుజస్కంధాలపై భారత్ భవిత
గుంటూరు ఎడ్యుకేషన్: భారత్ ఉజ్వల భవిత యువత భుజస్కంధాలపై ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకష్ణన్ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం భాష్యం మెడెక్స్ ఆధ్వర్యంలో ఏటుకూరు రోడ్డులోని వివాహ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నలంద, తక్షశిల వంటి విశ్వ విద్యాలయాల ద్వారా ప్రపంచ మానవాళికి జ్ఞానమందించిన ఘనమైన మన భారత సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. దేవుడిపై ఎంత భక్తి, గౌరవం ఉంటాయో, జ్ఞానాన్ని అందించే గురువుపై కూడా అంతే శ్రద్ధాభక్తులు ఉండాలని చెప్పారు. రమేష్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ పోతినేని రమేష్ బాబు మాట్లాడుతూ మనం నేర్చుకున్న జ్ఞానం, వైపుణ్యాలను సరైన మార్గంలో నడింపిచేవారే గురువని అన్నారు. జీజీహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్ అంకాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నల్లబోతు మురళి మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఉన్నతమైనదని, ఏ వృత్తిలో రాణించాలన్న గురువుల పాత్ర అమూల్యమైనదని పేర్కొన్నారు. భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకష్ణ మాట్లాడుతూ విద్యార్థిని, విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపేందుకు జీవితంలో ఎంతో సాధించిన ప్రేరణాత్మకమైన వ్యక్తులను వారికి పరిచయం చేస్తున్నట్లు చెప్పారు. వారి అనుభవసారాన్ని వినమ్రంగా గ్రహించి లక్ష్యసాధనకు కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు. సభకు భాష్యం మెడెక్స్ ప్రిన్సిపాల్ హరిబాబు అధ్యక్షత వహించారు. తొలుత అతిథుల చేతులమీదుగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం మంత్రి సత్యకుమార్ యాదవ్, డాక్టర్ రమేష్, డాక్టర్ మురళీలను భాష్యం ఛైర్మన్ భాష్యం రామకృష్ణ సత్కరించారు. విద్యార్థినీ, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతుల్ని అలరించాయి. అనంతరం అధ్యాపకులను సత్కరించారు. కార్యక్రమంలో భాష్యం విద్యాసంస్థల వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు, మేనేజింగ్ డైరెక్టర్ భాష్యం సాకేత్ రామ్ తదితరులు పాల్గొన్నారు. భాష్యం అన్ని శాఖల్లోనూ వేడుకలు ఘనంగా జరిగాయి.
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి
సత్యకుమార్ యాదవ్