
జిల్లాలో రైతులకు సరిపడా ఎరువుల నిల్వలు
నరసరావుపేట రూరల్: జిల్లాలో రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయ అధికారి ఎం.జగ్గారావు చెప్పారు. నరసరావుపేటలోని పలు ఎరువుల దుకాణాలు, జీడీసీఎంఎస్ షాఫులను గురువారం ఆయన తనిఖీ చేశారు. జగ్గారావు మాట్లాడుతూ రైతులు అనవసరంగా రసాయనిక ఎరువులు, యూరియాను కొనుగోలు చేసి స్టాక్ పెట్టుకోవద్దని సూచించారు. అవసరం మేరకే కొనుగోలు చేయాలని తెలిపారు. రసాయనిక ఎరువులు కొన్న రైతులు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని తెలిపారు. బిల్లులు ఇవ్వని ఎరువుల డీలర్లపై రసాయనిక ఎరువుల చట్టం 1985 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎరువులు అమ్మిన వెంటనే ఈ–పాస్ మిషన్ ద్వారా స్టాక్ అప్డేట్ చేయాలని డీలర్లను ఆదేశించారు. యూరియాను ఎమ్మార్పీ కంటే ఎక్కువకు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు కేవి శ్రీనివాసరావు, మండల వ్యవసాయ అధికారి ఐ.శాంతి, వ్యవసాయ విస్తరణ అధికారి కే.బ్రహ్మయ్య పాల్గొన్నారు.
పల్నాడు జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు