
జీజీహెచ్ ఏడీగా పూసల శ్రీనివాసరావు
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా (ఏడీ) పూసల శ్రీనివాసరావు గురువారం విధుల్లో చేరారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయంలో నేషనల్ హెల్త్ మిషన్ ఏడీగా పనిచేస్తున్న ఆయన్ను గుంటూరు జీజీహెచ్ ఏడీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణను కలిసి జాయినింగ్ రిపోర్టు అందజేశారు. గుంటూరు జీజీహెచ్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా, పరిపాలనా అధికారిగా, ఇన్‌చార్జి ఏడీగా శ్రీనివాసరావు పని చేశారు. 2024లో ఏడీగా పదోన్నతి పొంది, కమిషనర్ కార్యాలయానికి బదిలీ అయ్యారు. ప్రస్తుతం జీజీహెచ్ ఏడీగా పనిచేస్తున్న చింతలపూడి నాగేశ్వరరావు ఆగస్టు 31న ఉద్యోగ విరమణ చేశారు. నూతనంగా విధుల్లో చేరిన ఏడీని ఏపీ ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు, జిల్లా సెక్రటరీ శ్యామ్ శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ నాగూర్ షరీఫ్, జీజీహెచ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం నేతలు, పలువురు వైద్యులు, వైద్య సిబ్బంది బొకేలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీజీహెచ్‌లో పెండింగ్‌లో ఉన్న రికార్డు అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్లకు పదోన్నతులను మూడు నెలల్లో ఇస్తామని తెలిపారు. మందులు, సర్జికల్స్, ఇంప్లాంట్ల టెండర్ల ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేసి, ఆసుపత్రిలో రోగులకు అన్నీ అందుబాటులో ఉండేలా చూస్తామని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న ఆడిట్ పూర్తి చేయిస్తామని పేర్కొన్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ, జాయింట్ డైరెక్టర్ సుధారాణి సహకారంతో పరిపాలన విభాగంలో మార్పులు తీసుకొచ్చి, మెరుగైన పాలన అందించేందుకు కృషి చేస్తామని శ్రీనివాసరావు తెలిపారు.