
యడవల్లి దళితులకు న్యాయం చేయాలి
నరసరావుపేట: చిలకలూరిపేట మండలం యడవల్లి దళిత రైతుల నుంచి ప్రభుత్వం కారుచౌకగా తీసుకున్న విలువైన భూములపై హైకోర్టు ఉత్తర్వులను అనుసరించి న్యాయమైన పరిహారం ఇవ్వాలని కౌలురైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.రాధాకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరేను కలిసి హైకోర్టు ఉత్తర్వు కాపీలను అందజేసి కోర్టు ఆదేశాల మేరకు యడవల్లి దళిత రైతులకు న్యాయమైన పరిహారం ఇప్పించాలని కోరారు. రాధాకృష్ణ మాట్లాడుతూ రైతులు కలెక్టర్‌కు పెట్టుకున్న అర్జీపై మూడు వారాలలోగా సమాధానం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించిందన్నారు. యడవల్లి గ్రామంలో 1975లో ప్రభుత్వ ఆదేశాల మేరకు నాటి జిల్లా కలెక్టర్ చంద్రయ్య భూమిలేని 120 దళిత, గిరిజన కుటుంబాలకు 416 ఎకరాలు బీడు భూమిని అసైన్‌న్డ్ చేసి వీకర్స్ కాలనైజేషన్ సొసైటీ పేరిట రిజిస్టర్‌చేసి పంపిణీ చేశారన్నారు. వాటిని 50 ఏళ్ల నుంచి లిఫ్ట్ ద్వారా ఏడాదికి వరి, ఆరుతడి రెండు పంటలు సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నారన్నారు. భూములలో గ్రానైట్ నిక్షేపాల నెపంతో ప్రభుత్వం స్వాధీనం చేసుకుందన్నారు. దళిత రైతులను బెదిరించి, భయభ్రాంతులకు గురిచేసి ఎకరాకు రూ.8.33లక్షల పరిహారం ఇచ్చి స్వాధీనం చేసుకుందన్నారు. భూమి స్వాధీనం చేసుకునే క్రమంలో 2013 భూసేకరణ చట్టం అమలు చేయకుండా బలవంతపు భూ సేకరణ జరిపారన్నారు. అప్పటి 120 మంది లబ్ధిదారులకుగాను ప్రస్తుతం వారి వారసులు 244 మందిగా ప్రభుత్వం గుర్తించిందన్నారు. నాటి నుంచి నేటివరకు పేద రైతులు, రైతు సంఘాల ఆధ్వర్యంలో చట్టప్రకారం న్యాయమైన పరిహారం ఇవ్వాలని అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారన్నారు. గత్యంతరంలేని పరిస్థితుల్లో తమకు న్యాయం చేయాలని హైకోర్టులో రిట్ పిటిషన్ వేయడంతో దీనిపై వివరణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌కు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఎకరాకు రూ.40లక్షల పరిహారం ఇవ్వాలని పిటీషనర్ల తరుపు న్యాయవాది వి.రవీందర్ కోర్టులో వాదనలు వినిపించారన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వి.వెంకటస్వామి, పెద్దిరాజు, యడవల్లి రైతులు పాల్గొన్నారు.