
యూరియా అక్రమంగా విక్రయిస్తే కఠిన చర్యలు
దాచేపల్లి: యూరియా అక్రమంగా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ జి.శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. ఇటీవల కాలంలో యూరియా కొరత అధికంగా ఉండడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది వ్యాపారులు ఏపీ నుంచి యూరియా బస్తాలను తెలంగాణకు అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డారు. దీంతో యూరియా ఇలా తరలిపోకుండా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు సంయుక్తంగా బుధవారం రాత్రి పొందుగల, తాంగేడ సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు చేపట్టారు. ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లే ప్రతి వాహనాన్ని ఆపి పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. యూరియా తెలంగాణకు తరలించడం చట్టరీత్యా నేరమన్నారు. పూర్తిస్థాయిలో ఏపీలోనే రైతులు వినియోగించాలని కోరారు. అక్రమంగా తెలంగాణకు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యవసాయ శాఖ పిడుగురాళ్ల ఏడీఏ శ్రీకృష్ణదేవరాయలు, స్థానిక ఏవో వెంకటేష్, ఆర్‌ఐ శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు.