
ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో ఆరోగ్యం
బాపట్ల: ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను వినియోగించి ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లోని వీక్షణ సమావేశ మందిరంలో బుధవారం ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ విభాగం, డీఆర్‌డీఏ–వెలుగు శాఖల సమన్వయంతో ప్రతి మండల, జిల్లా కేంద్రాల్లో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను ప్రారంభించాలని ఆయన ఆదేశించారు. పురుగు మందు అవశేషాలు లేని ఆరోగ్యకరమైన ఆకుకూరలు, కూరగాయలు, ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనెలు అమ్మాలని తెలిపారు. గృహ వినియోగానికి అవసరమైన అన్ని ఉత్పత్తులను ప్రకృతి వ్యవసాయ రైతుల నుంచి సేకరించి ఈ కేందాల్లో విక్రయించాలని ఆయన తెలిపారు. విత్తన దశ నుంచి పంట ఇంటికి వచ్చే వరకు ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించిన పంటలకు రైతు సాధికార సంస్థ ద్వారా ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఇస్తామని చెప్పారు. వీరి నుంచి మాత్రమే ఉత్పత్తులను సేకరించాలని ఆయన సూచించారు. ప్రజలు కూడా ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా క్యాన్సర్, మధుమేహం, రక్తహీనత, సంతానలేమి తదితర అనారోగ్యాల నుంచి రక్షణ పొందవచ్చని తెలిపారు.
కార్యక్రమాలపై ఆరా
ప్రకృతి వ్యవసాయ విభాగం ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి సంబంధిత అధికారులను ఆరా తీశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ విభాగం, నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ కింద గుర్తించిన 170 క్లస్టర్లలో అమలు చేయబోవుచున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాల విధి విధానాలపై జిల్లా వ్యవసాయ అధికారి సుబ్రహ్మణ్యేశ్వరరావు వివరించారు. ప్రస్తుతం 174 గ్రామ పంచాయతీల్లో ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయని తెలిపారు. కొత్తగా 273 గ్రామ పంచాయతీల్లో కార్యక్రమాలను అమలు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కొత్త గ్రామ పంచాయతీల్లో పొదుపు సంఘాల ద్వారా గ్రామస్తులను కలసి కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమాల అమలుకు డీఆర్‌డీఏ, వెలుగు, వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక శాఖ సిబ్బంది సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో రైతు సాధికార సంస్థ, ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ సంక్షిప్త మార్గదర్శిని, ప్రకృతి వ్యవసాయ విధానాల కరపత్రాలను జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి ఆవిష్కరించారు. ఉద్యాన శాఖ అధికారి షేక్ కలీం, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వేణుగోపాల్, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ సయ్యద్ అక్తర్ హుస్సేన్, ప్రకృతి వ్యవసాయ విభాగం అడిషనల్ డీపీఎం జె. మోహన్, డీఆర్‌డీఏ డీపీఎం సరిత, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ జె.వెంకట మురళి