
ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి దుర్మరణం
మేదరమెట్ల: స్కూటీని ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టడంతో వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన కొరిశపాడు మండలంలోని మేదరమెట్ల–అనమనమూరు రోడ్డు మలుపు వద్ద ఆదివారం జరిగింది. అనమనమూరు గ్రామానికి చెందిన పైఎద్దు ఏడుకొండలు (32) మేదరమెట్ల వచ్చి స్కూటీపై స్వగ్రామం వెళ్తున్నాడు. అనమనమూరు రోడ్డు మలుపు వద్దకు రాగానే ఎదురుగా ఇసుక లోడు ట్రాక్టర్ స్కూటీని ఢీకొంది. అదుపు తప్పిన ట్రాక్టర్ పక్కనే ఉన్న కాలువలోకి బోల్తా కొట్టింది. ఏడుకొండలు కూడా కాలువలో పడిపోవడంతో ట్రాక్టర్‌లోని ఇసుక పూర్తిగా అతనిపై పడింది. ఏడుకొండలు ఊపిరాడక అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యాడు. సమాచారం తెలుసుకున్న మేదరమెట్ల ఎస్‌ఐ మహ్మద్ రఫీ ఘటనా స్థలానికి చేరుకొని ట్రాక్టర్‌ను పక్కకు తీయించారు. కేసు నమోదు చేసి ఏడుకొండలు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏడుకొండలుకు భార్య, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు.