
‘కార్పొరేట్’లకు కారుచౌకగా భూములు
తాడేపల్లి రూరల్: కార్పొరేట్ సంస్థలకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం రూ.కోట్ల విలువైన భూములను కారుచౌకగా కట్టబెడుతోందని సీపీఎం మండిపడింది. ఈ మేరకు ఆ పార్టీ గుంటూరు జిల్లా కార్యదర్శి వై.నేతాజీ ఆరోపించారు. ఆదివారం రాజధాని డివిజన్ కమిటీ సమావేశాన్ని ఉండవల్లిలోని పార్టీ కార్యాలయంలో కుంభ ఆంజనేయులు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన వై. నేతాజీ మాట్లాడుతూ.. రాజధాని అమరావతిలో ప్రభుత్వ అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం 63 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్ధలు, ప్రైవేటు సంస్ధలకు భూములు కేటాయించారన్నారు. ఇప్పటికీ 55 సంస్థలు అసలు నిర్మాణ పనులే ప్రారంభించలేదని విమర్శించారు. రాజధాని రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్‌లలో అభివృద్ధి పనులు ఎప్పుడు ప్రారంభిస్తారో తెలపాలని కోరారు. పనులు చేపట్టని ఆయా సంస్థలకు కేటాయించిన భూముల వద్ద నిరసన కార్య క్రమాలు చేపడతామని హెచ్చరించారు. అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచబోమని చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు ప్రజలపై భారాన్ని మోపారని విమర్శించారు. ప్రజా సమస్యలను వదిలేసి కార్పొరేట్ సంస్థల చుట్టూ పాలకులు ప్రదక్షిణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో పార్టీ రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం.రవి, డివిజన్ నాయకులు టి.బక్కిరెడ్డి, ఎం.భాగ్యరాజు, జె.నవీన్ ప్రకాష్, పేరం బాబూరావు, గైరబోయిన నాగేశ్వరరావు, అత్తలూరి వీర వెంకయ్య, పార్వతి, కె.రామకృష్ణ, షేక్‌ఖాదర్ బాబా తదితరులు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వ తీరుపై
సీపీఎం మండిపాటు
పాలనను గాలికొదిలేసి వారి చుట్టూ
ప్రదక్షిణలు చేస్తోందని ఆగ్రహం