
యంత్రాంగానికి అప్రమత్తత ముఖ్యం
● జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి
● రెవెన్యూ అధికారులతో సమావేశం
బాపట్ల: వరదలు వస్తే తక్షణమే నివారణ, సహాయక చర్యలకు అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి తెలిపారు. విపత్తు నిర్వహణ, నిర్మూలన, ముందస్తు ప్రణాళిక అంశాలపై ఆర్డీవోలతో గురువారం ఆయన సమావేశం నిర్వహించారు. విపత్తుల నిర్వహణపై సూక్ష్మ స్థాయిలో సమగ్ర ప్రణాళిక ఉండాలని కలెక్టర్ చెప్పారు. కృష్ణానది వరద అకస్మాత్తుగా వస్తే ముంపు, ప్రభావిత ప్రాంతాల వివరాలు, జనాభా వంటివి సేకరించాలన్నారు. తీర ప్రాంతంలో ఉన్న బాపట్ల జిల్లాకు తుపాను హెచ్చరికలు వస్తే ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో గుర్తించాలన్నారు. దెబ్బతినే గృహాలు, ప్రాంతాలపై నివేదిక సిద్ధం చేయాలన్నారు. భారీ వర్షాలు కురిస్తే లోతట్టు ప్రాంతాలు, జలమయం అయ్యే గృహాల వివరాలు ముందస్తుగా గుర్తించాలన్నారు. వరద, తుపాను, భారీ వర్షాలకు నష్టాలు, ముందస్తుగా తీసుకోవలసిన చర్యలపై వేరువేరుగా ప్రణాళికలు రూపొందించాలని పేర్కొన్నారు.
లంక గ్రామాలకు పొంచి ఉన్న ముప్పు
కృష్ణానది ఎగువ ప్రాంతాలలో వర్షాలు అధికంగా కురవడం, డ్యాములలోకి వరద నీరు చేరుతుందన్నారు. ఈ నేపథ్యంలో వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నందున్న లంక గ్రామాలకు ప్రమాదం పొంచి ఉందన్నారు. 14 నివాస ప్రాంతాలు మునిగే అవకాశం ఉందన్నారు. కృష్ణానది కరకట్ట బలహీనంగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గండ్లు పడే అవకాశం ఉన్న ప్రాంతాలలో ఇసుక బస్తాలతో బలోపేతం చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆ ప్రాంతాలలో గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వృద్ధులు, చిన్నారులను గుర్తించి వివరాలు పంపాలన్నారు. మర బోట్లు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. పునరావాస కేంద్రాలు ముందుస్తుగా గుర్తించాలన్నారు. మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు, పది రోజులు భోజన సదుపాయాలు అందించేలా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. సహాయక చర్యలకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ప్రతి 30 కుటుంబాలకు ఒక ఉద్యోగి అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. నివాస ప్రాంతానికి ఒక మండల అధికారిని నియమించాలన్నారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జి సంయుక్త కలెక్టర్, డీఆర్‌ఓ జి.గంగాధర్ గౌడ్, ఆర్డీవోలు గ్లోరియా, చంద్రశేఖర్, రామలక్ష్మి, సీపీఓ షాలెంరాజు, సంబంధిత విభాగం పర్యవేక్షకుడు షేక్ షఫీ, తదితరులు పాల్గొన్నారు.