
ఎగసి పడుతున్న అలలు
నిలిచిన వేట
గత నెల రోజులుగా వేట నిషేధం కావటంతో మరో వారంలో ఎత్తివేసేందుకు అవకాశం ఉండగా వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా ఇప్పటికీ అనుమతి రాలేదు. వేట మినహా మిగిలిన ఉపాధి అవకాశాలు కూడా లేకపోవటంతో సముద్రానికి దగ్గరగా ఉన్న రామ్‌నగర్ పెద్దకాలువలో మత్స్యకారులు చేపలు పడుతూ పొట్ట నింపుకొంటున్నారు.
బాపట్ల: వాతావరణంలో వచ్చిన మార్పు కారణంగా మూడు రోజులుగా సముద్రతీరం నిర్మానుష్యంగా మారింది. మరోపక్కన అలలు ఎగసి పడుతున్నాయి. ఆకాశం మేఘావృతం కావటంతోపాటు సాయంత్రానికి చిమ్మచీకట్లు కమ్ముకొంటున్నాయి. ఈదురుగాలులు ఎక్కువగా రావటంతో పాటు రాకాసి అలలు ఎగిసి పడుతుండటంతో తీరానికి వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది. తీరం ఇంత నిర్మానుష్యంగా మారటం ఇటీవల కాలంలో ఎప్పుడు చూడలేదని స్థానికులు చెబుతున్నారు.
కరువుభత్యం అంతంత మాత్రమే
సముద్రం వేట నిషేధం సందర్భంగా 45 రోజులపాటు ప్రభుత్వం కరువుభత్యం ఇస్తోంది. బాపట్ల జిల్లాలో 5 వేల మందికిపైగానే మత్స్యకారులు ఉన్నప్పటికీ సగం మందికి కూడా అందలేదు. ఈ ఏడాది కూడా ఆకలికేకలు తప్పటంలేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చిరువ్యాపారులలో అలజడి
వాతావరణంలో వచ్చిన మార్పు కారణంగా సూర్యలంకకు పర్యాటకులు సంఖ్య తగ్గిపోవటంతో తీరంలోని చిరువ్యాపారులు కనీసం బోణీలు కూడా లేకపోవటంతో ఇబ్బంది పడుతున్నారు. కనీసం రోజుకు 50 మంది పర్యాటకులు కూడా రాకపోవటంతో ఆవేదన చెందుతున్నారు.
నిర్మానుష్యంగా మారిన సముద్ర తీరం వేట లేక అల్లాడుతున్న మత్స్యకారులు

ఎగసి పడుతున్న అలలు