
దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి
బాపట్ల: గిరిజన, దివ్యాంగుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్‌ఎస్ హాలులో జిల్లాలోని గిరిజన, దివ్యాంగుల కోసం ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజన, దివ్యాంగుల సమస్యలను సత్వరమే పరిష్కరించడానికి అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. వేటపాలెంలో 60 మంది యానాది కులానికి చెందిన వారికి ఆలస్యంగా జనన ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారని, ఆధార్ కోసం పత్రాలు కోరుతూ వచ్చిన ఫిర్యాదునకు ఆయన స్పందించారు. వెంటనే పత్రాలు జారీ చేయాలని వేటపాలెం తహసీల్దార్‌ను ఆదేశించారు. అక్కయ్యపాలెం పంచాయతీలో 300 యానాదుల కుటుంబాలకు శ్మశానం కోసం స్థల సేకరణ చేసి నివేదిక అందించాలని కూడా ఆదేశాలిచ్చారు. జిల్లాలో దివ్యాంగుల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం వారంలో సోమ, మంగళ, బుధవారాల్లో బాపట్ల జిల్లాలో విధులు నిర్వహించాలని సహాయ సంచాలకులు, వికలాంగుల సంక్షేమ శాఖ అధికారిని ఆయన ఆదేశించారు. వారి కోసం స్థానిక కలెక్టరేట్‌లో కార్యాలయం ఏర్పాటు చేశామన్నారు. మిగిలిన 3 రోజులు ప్రకాశం జిల్లాలో విధులు నిర్వహించాలని ఆయన దివ్యాంగుల శాఖ అధికారిని ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో 5% కోటా అమలు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో కూడా 5% ఉద్యోగ కల్పనకు చర్యలు తీసుకోవాలని ఆయన ఏడీని ఆదేశించారు. జిల్లాలో దివ్యాంగుల కొరకు మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌లో 5% షాపులు కేటాయింపునకు చర్యలు తీసుకోవాలని బాపట్ల మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. 16 మంది ట్రానన్స్ జెండర్‌లకు గుర్తింపు ధ్రువీకరణ పత్రాలను జిల్లా కలెక్టర్ అందజేశారు. యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్‌ను వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో 42 వేల మంది ఉద్యోగులు ఉండగా, ఇప్పటివరకు కేవలం 6 వేల మంది మాత్రమే రిజిస్ట్రేషన్ పూర్తి చేశారన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి. గంగాధర్ గౌడ్, బాపట్ల రెవెన్యూ డివిజన్ అధికారి గ్లోరియా, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ప్రకాష్ రావు, వికలాంగుల సంక్షేమ శాఖ అధికారి అర్చన తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి