
బూత్ కమిటీ జిల్లా అధ్యక్షులుగా శ్రీనివాసరెడ్డి
బాపట్ల టౌన్: బాపట్ల నియోజకవర్గానికి చెందిన మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల జిల్లా బూత్ కమిటీల విభాగం అధ్యక్షులుగా నియమిస్తూ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. బాపట్ల జిల్లాలో బూత్ కమిటీలను సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తనను ఈ పదవిలో నియమించినందుకు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడి అరెస్టు
యడ్లపాడు: బాలికపై లైంగిక దాడి ఘటనలో పొక్సో కేసు నమోదైన యువకుడిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. కోర్టుకు హాజరు పరచగా రిమాండ్ విధించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం హౌస్ గణేష్‌పాడు గ్రామ నివాసి ఆళ్ల కొండలు, మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ బాలికను ఆసక్తికరమైన మాటలతో ఆకర్షించాడు. సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన గత నెల 15న జరిగింది. ఈ మేరకు బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా యడ్లపాడు పోలీస్ స్టేషన్‌న్‌లో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నరసరావుపేట డీఎస్పీ పర్యవేక్షణలో విచారణ చేపట్టిన పోలీసులు, సాంకేతిక ఆధారాలతో పాటు వాంగ్మూలాలు సేకరించారు. నిందితుడిని ఈ నెల 22న పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం బోయపాలెంలోని హైవే వంతెన వద్ద పట్టుకున్నారు. చిలకలూరిపేట అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు హాజరు పరుచగా, జూన్ 5వ తేదీ వరకు రిమాండ్ విధించినట్లు యడ్లపాడు ఎస్‌ఐ టి. శివరామకృష్ణ తెలిపారు.
బదిలీల దరఖాస్తులో జాగ్రత్తలు అవసరం
నరసరావుపేట ఈస్ట్: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు దరఖాస్తు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు సూచించారు. ఉపాధ్యాయుల బదిలీలపై శుక్రవారం యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దరఖాస్తు చేసే సమయంలో సమస్యలు తలెత్తితే తమ దృష్టికి తీసుకరావాలని తెలిపారు. ప్రభుత్వం దాదాపు 770 ప్రాథమికోన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలలుగా అప్‌గ్రేడ్ చేయటం మంచి పరిణామమని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచటంలోనూ, విద్యార్థుల నమోదు, హాజరు పెంచటంలోనూ కార్యకర్తలు ముందుండాలని సూచించారు.