
వృద్ధులకు శుభవార్త!
● సీనియర్ సిటిజన్ కార్డు దరఖాస్తులకు ఆహ్వానం ● గ్రామ సచివాలయంలోనే చేసుకునే అవకాశం ● రెండు రోజుల్లోనే పొందేలా చర్యలు ● కార్డు ద్వారా పలు ప్రయోజనాలు
యడ్లపాడు: కేంద్ర ప్రభుత్వం 60 సంవత్సరాలు నిండిన వృద్ధులకు ప్రత్యేకంగా ‘సీనియర్ సిటిజన్ కార్డు’లను జారీ చేయాలని నిర్ణయించింది. వీటిని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఈ సేవకోసం దూరంగా వెళ్లాల్సిన అవసరం లేదు. గ్రామ/వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. దరఖాస్తు ప్రక్రియ కూడా చాలా సులభం. ఆధార్, వయసును నిర్ధారించే గుర్తింపు పత్రం, బ్లడ్‌గ్రూప్ వివరాలు, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోతో పాటు రూ. 40 చెల్లిస్తే రెండు రోజుల్లోనే కార్డును అందజేస్తారు. అయితే ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నంబర్ తప్పనిసరిగా ఉండాలి.
ఇవి ప్రయోజనాలు
ఈ కార్డుతో వృద్ధులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పలు రకాల ప్రయోజనాలు అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల్లో 25శాతం రాయితీ, ప్రత్యేక సీట్లు, రైల్వే స్టేషన్లలో కౌంటర్ల వద్ద ప్రాధాన్యత, వరుసలో నిలబడి ఉండాల్సిన అవసరం ఉండదు. బ్యాంకుల్లో ఫిక్సడ్ డిపాజిట్లపై అఽధిక వడ్డీ, ఆదాయపు పన్ను మినహాయింపు కోసం, పాస్‌పోర్ట్ ఫీజులో తగ్గింపు వంటి లాభాలు ఉన్నాయి. ఆయుష్మాన్ భార త్‌కార్డ్, వయో వందన హెల్త్ కార్డు పొందడానికి ఉపయోగపడుతుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల కేటాయింపులతో పాటు కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ రాయితీపై ఆరోగ్య సేవలు లభించనున్నాయి. ఇంకా దేవాలయాలలో ప్రాధాన్యత దర్శనం పొందడానికి ఈ కార్డు దోహదం కానుంది.
25వేల మందికి జారీ
గుంటూరు, పల్నాడు జిల్లాల పరిధిలో ఈ ఏడాది మార్చి వరకు ఆఫ్‌లైన్‌లో 26,575 దరఖాస్తులను సీనియర్ సిటిజన్స్ సమర్పించారు. ఏప్రిల్ ఒకటి నుంచి ఈ ప్రక్రియను ఆన్‌లైన్ చేయడంతో 1438 మంది నేరుగా దరఖాస్తు చేసుకున్నారు. ఆయా అర్జీలను పరిశీలించి 25వేల మందికి పైగా కార్డులను జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.