
పేదరికం నుంచి బంగారు కుటుంబాలను బయటకు తేవాలి
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి
బాపట్ల: బంగారు కుటుంబాలను పేదరికం నుంచి బయటకు తెచ్చేలా మార్గదర్శకులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అన్నారు. పీ–4 అమలు, ప్రధానమంత్రి సూర్య ఘర్ ముప్త్ బిజ్లీ యోజన పథకం అమలు తీరుపై శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని వీక్షణ సమావేశ మందిరంలో కలెక్టర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆర్థిక, సామాజిక రంగాల్లో పేద కుటుంబాలు అభివృద్ధి చెందడమే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యోద్దేశమని అన్నారు. నిరుపేదలను అభివృద్ధిలోకి తీసుకురావడానికి మార్గదర్శకులను ఎంపిక చేయాలని తెలిపారు. పీ–4లో మార్గదర్శకులను రిజిస్ట్రేషన్ చేసే విధానం గురించి ముఖ్య ప్రణాళిక అధికారి వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఒక్కో మండలంలో సుమారు 500 బంగారు కుటుంబాలు ఉండగా, ఆ కుటుంబాల్లోని యువతకు నైపుణ్య అభివృద్ధిపై అవగాహన కల్పించాలన్నారు. బంగారు కుటుంబాలను ఇప్పటికే ఎంపిక చేసుకున్న మార్గదర్శకులకు ఆ కుటుంబాలకు ఎలా సహకరించాలో అవగాహన కల్పించాలన్నారు. మార్గదర్శకులు ఎంచుకున్న కుటుంబాలను గ్రూపులుగా ఏర్పాటు చేసి వారి వివరాలు వాట్సాప్ ద్వారా వారికి తెలియజేయాలన్నారు. సమావేశంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాసరావు, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె శ్రీనివాసరావు, డ్వామా పీడీ విజయలక్ష్మి, ఏపీ ఎస్పీడీసీఎల్ ఎస్‌ఈ ఆంజనేయులు, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్, బాపట్ల, చీరాల, రేపల్లె, డీఎల్‌డీఓలు విజయలక్ష్మి, పద్మావతి, పద్మ, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఎలక్ట్రిసిటీ అధికారులు పాల్గొన్నారు.