
సాక్ష్యాధారాల సేకరణలో నైపుణ్యం కలిగి ఉండాలి
ఎస్పీ తుషార్ డూడీ
బాపట్లటౌన్: సాక్ష్యాధారాల సేకరణలో నైపుణ్యతతో వ్యవహరించినప్పుడే దోషులను కఠినంగా శిక్షించగలమని ఎస్పీ తుషార్ డూడీ అన్నారు. జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం జిల్లాలోని పోలీస్ అధికారులకు భౌతిక ఆధారాల సేకరణలో శాసీ్త్రయ పద్ధతులపై ఫోరెన్సిక్ నిపుణుల ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు జిల్లాలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులకు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులకు ఫోరెన్సిక్ నిపుణులతో ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. పోలీస్‌స్టేషన్లలో నమోదవుతున్న కేసుల్లోని నిందితులు శిక్షింపబడాలంటే నేర స్థలం నుంచి భౌతిక సాక్ష్యాధారాలను సక్రమ పద్ధతిలో సేకరించడం కీలకమన్నారు. ఆధారాలను సేకరించడంలో ఆధునిక శాసీ్త్రయ, సాంకేతిక పద్ధతులను అవలంభించాలన్నారు. భౌతిక ఆధారాలను ప్యాకింగ్ చేసి ల్యాబ్‌లకు పంపడం చాలా ముఖ్యమన్నారు. నేర స్థలం నుంచి రక్త నమూనాలను, సెమన్, వెంట్రుకలు, ఉమ్ము, పాదముద్రలు, వేలిముద్రలు సేకరించడం, మత్తు పదార్థాలు, మానవ అవయవాలు, విష పదార్థాలు, సైబరు నేరాలకు సంబంధించిన కేసుల్లో ఆడియోలు, వీడియోలను, మెమరీ కార్డులు, హార్డ్ డిస్క్‌లను ఏవిధంగా సేకరించి భద్రపరచాలి, ఫోరెన్సిక్ నిపుణుల పరిశీలనకు పంపే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను క్షుణ్ణంగా వివరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ టి.పి.విఠలేశ్వర్, బాపట్ల, చీరాల, రేపల్లె డీఎస్పీలు రామాంజనేయులు, మొయిన్, శ్రీనివాసరావు, సీసీఎస్ డీఎస్పీ జగదీష్ నాయక్, ఏఆర్ డీఎస్పీ విజయసారథి, మంగళగిరి ఫోరెన్సిక్ సైనన్స్ ల్యాబ్ నిపుణులు, జిల్లాలోని ప్రభుత్వ వైద్యులు, సంబంధిత కోర్టు పీపీ, ఏపీపీలు, జిల్లాలో విధులు నిర్వహిస్తున్న సీఐలు, ఎస్‌ఐలు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.