అటవీ సంరక్షణ అందరి బాధ్యత
జిల్లా అటవీ శాఖ అధికారి రామచంద్రరావు
కారెంపూడి: అడవుల రక్షణ, వన్యప్రాణి సంరక్షణపై ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని జిల్లా అటవీ శాఖ అధికారి ఎన్. రామచంద్రరావు పిలుపునిచ్చారు. కారెంపూడికి చెందిన పర్యావరణ వేత్త కొమెర అంకారావు (జాజి) నల్లమలలో కోటి విత్తన బంతులు చల్లాలని సంకల్పించారు. ఈ మేరకు బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో డీఎఫ్‌వో రామచంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మొక్కలు పెరగడానికి అనువైన ప్రాంతంలో కొన్ని విత్తన బంతులను డీఎఫ్‌వో చల్లారు. అంకారావు స్వచ్ఛందంగా అడవుల అభివృద్ధికి చేస్తున్న కృషిని అభినందించారు. ఇలాంటి నిస్వార్థ కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని, అందుకే అటవీశాఖ పరంగా కూడా సహకారం అందిస్తున్నామని పేర్కొన్నారు. యువత, విద్యార్థులు కూడా పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం కారెంపూడి బ్రహ్మనాయుడు జెడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు ఆయన ప్రకృతి పాఠాలు బోధించారు. అడవుల సంరక్షణ, పర్యావరణ రక్షణ, వన్యప్రాణులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరూ ప్రాథమిక కర్తవ్యంగా భావించాలన్నారు. కొమెర అంకారావు విద్యార్థులకు సీడ్ బాల్స్ తయారీపై అవగాహన కల్పించారు. ప్రతి విద్యార్థి ఒక్కో సీడ్ బాల్ తయారు చేసి మొక్కలు పెరిగేందుకు కృషి చేస్తే ప్రాణికోటి జీవించడానికి అనువైన వాతావరణం ఏర్పడుతుందని వివరించారు. కార్యక్రమంలో అటవీ శాఖ రేంజ్ అధికారి వెంకటరమణ, డిప్యూటీ రేంజ్ అధికారి శ్రీహరికుమార్, బీట్ అధికారి అమీర్ జానీ బాషా, అటవీ శాఖ సిబ్బంది, వన సంరక్షణ సమితి సభ్యులు, హెచ్‌ఎం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
అటవీ సంరక్షణ అందరి బాధ్యత


