
బాపట్ల: ఢిల్లీలో ఈనెల 5వ తేదీ నుంచి జరిగే జాతీయస్థాయి ఈత పోటీలకు బాపట్ల జూనియర్ కళాశాల విద్యార్థి ఉప్పాల జ్ఞానవివేక్‌గౌడ్ ఎంపికయ్యాడు. ఈ ఏడాది జనవరిలో తిరుపతిలో జరిగిన రాష్ట్రస్థాయి ఈత పోటీలలో ఉమ్మడి గుంటూరు జిల్లా తరుపున పాల్గొన్న వివేక్ రెండు వెండి పతకాలు సాధించాడు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరిగే పోటీలలో పాల్గొనడానికి అవకాశం దొరికింది. వివేక్‌గౌడ్ జాతీయపోటీలకు ఎంపిక కావటంపై హర్షం వ్యక్తం చేశారు.
జీజీహెచ్‌లో ఎన్‌ఎంసీ తనిఖీలు
గుంటూరు మెడికల్: గుంటూరు వైద్య కళాశాల, గుంటూరు జీజీహెచ్‌లో శుక్రవారం నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) సభ్యులు ఢిల్లీకి చెందిన డాక్టర్ ఉమేష్, హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ శ్రీనివాస్ తనిఖీలు చేశారు. న్యూరోసర్జరీ వైద్య విభాగంలో, యూరాలజీ వైద్య విభాగంలో తనిఖీలు చేశారు. ప్రస్తుతం ఉన్న సూపర్‌స్పెషాలిటీ పీజీ సీట్లు రెన్యూవల్ చేసేందుకు వైద్య కళాశాల, ఆసుపత్రిలో సరిపడా వైద్య సౌకర్యాలు, బోధనా సిబ్బంది ఉన్నారా, లేరా అనే విషయాలు పరిశీలించారు. వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నీలి ఉమాజ్యోతి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ నీలం ప్రభావతి, ఆ రెండు విభాగాల వైద్యులు, ఎన్‌ఎంసీ ఇన్‌స్పెక్టర్లతోపాటు ఉండి, వారు అడిగిన సమాచారం అందజేశారు. ప్రస్తుతం న్యూరో సర్జరీలో విభాగంలో నాలుగు పీజీ సీట్లు, యూరాలజీ వైద్య విభాగంలో రెండు పీజీ సీట్లు ఉన్నాయి.
డీఎస్సీ నోటిఫికేషన్
విడుదల చేయాలి
సీఎంకు ఎమ్మెల్సీ లక్ష్మణరావు వినతి
గుంటూరుఎడ్యుకేషన్: శుక్రవారం గుంటూరు నగరానికి వచ్చిన ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని పోలీస్‌పరేడ్ గ్రౌండ్స్‌లోని హెలీప్యాడ్ వద్ద కలిసిన ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు వివిధ అంశాలపై వినతిపత్రం సమర్పించారు. ఖాళీగా ఉన్న 25 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని విజ్ఞప్తిచేశారు. 1998–డీఎస్సీ క్వాలిఫై డ్ అభ్యర్థులకు మానవతా దృక్పథంతో పోస్టింగ్స్ కల్పించడంపై సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.